Friday, November 22, 2024
HomeTrending Newsస్టీల్ ప్లాంట్ పై ముందుకే: కేంద్రం

స్టీల్ ప్లాంట్ పై ముందుకే: కేంద్రం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కుతగ్గే ప్రసక్తేలేదని కేంద్రప్రభుత్వం మరోసారి స్పష్టంచేసింది. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలుచేసింది. స్టీల్ ప్లాంట్ లో మొత్తం 100 శాతం వాటాను ప్రైవేటీకరిస్తున్నామని, ఇప్పటికే బిడ్డింగ్ లను ఆహ్వానించామని వెల్లడించింది. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల భద్రతకు ఎలాంటి రాజ్యంగ భరోసా లేదని, అవసరమనుకుంటే కొందరు ఉద్యోగులను తొలగిస్తామని తేల్చి చెప్పింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీబీఐ మాజీ జేడీ వి.వి. ల‌క్ష్మీనారాయ‌ణ ఏపీ హైకోర్టులో పిటిష‌న్‌ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం గత శుక్రవారం విచారణ మొదలు పెట్టింది.  కౌంట‌ర్ దాఖ‌లుకు వారం రోజుల స‌మ‌యం ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టును కోరారు. దీనిపై లక్ష్మీనారాయ‌ణ త‌ర‌ఫు న్యాయ‌వాది అభ్యంత‌రాలు తెలిపారు. కేంద్రం కావాలని తాత్సారం చేస్తోంద‌ని… ఈ నెల 29న బిడ్డింగ్‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేసుకుంటోంద‌ని వివ‌రించారు. సమగ్ర వివ‌ర‌ణను అఫిడవిట్ రూపంలో  ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

నేడు హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. వి.వి. ల‌క్ష్మీనారాయ‌ణ గత ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారని, అయన వేసిన పిటిషన్ రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని, దానికి విచారణ అర్హత లేదని అఫిడవిట్ లో కేంద్రం పేర్కొంది.

తాము చేస్తున్నది ప్రజా ఉద్యమమని, కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకూ పోరు సాగిస్తామని కార్మిక సంఘం నేతలు స్పష్టం చేస్తున్నారు. ఆగస్టు 2,3 తేదీల్లో ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద తాము నిర్వహించ తలపెట్టిన ఆందోళన కొనసాగుతుందని చెప్పారు. ఇది ఒక్క స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సమస్య మాత్రమే కాదని, ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్ కు సంబంధించిన అంశమని చెప్పారు. చరిత్రను తిరగ రాస్తామన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్