Sunday, January 19, 2025
HomeTrending Newsకేంద్రం సమాఖ్య స్పూర్తి చూపాలి

కేంద్రం సమాఖ్య స్పూర్తి చూపాలి

Central Government Should Show Federal Spirit :

దేశ ఆర్థిక ప్రగతి రథానికి రాష్ట్రాలే చోదకశక్తులని, రాష్ట్రాల బలమే దేశ బలమని పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. దేశంలోని రాష్ట్రాలు ఆర్థిక ప్రగతిలో అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా కేంద్రం సహకరించాలన్నారు.

దేశ జిడిపీకి దోహదపడుతున్న ముందు వరుసలోని రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం నాలుగవ స్థానంలో నిలవడం దేశం గర్వించదగ్గ విషయమని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

సామర్థ్యం వున్న తెలంగాణ వంటి రాష్ట్రాలను కేంద్రం ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సహకరిస్తే దేశాభివృద్ధి మరింత వేగవంతమౌతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ కు స్పష్టం చేశారు.

సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ నిర్వహించిన ‘రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆర్థిక శాఖ మంత్రుల వీడియో కాన్పరెన్స్ లో, ప్రగతి భవన్ నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుతో కలిసి మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ వాదనను కేంద్రానికి బలంగా వినిపించారు.

ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ…
‘‘ దేశంలో తెలంగాణ ఏఢు సంవత్సరాల కింద ఏర్పడ్డ అతి పిన్నవయసున్న రాష్ట్రం. ఇటీవల ఆర్బీఐ ప్రచురించిన నివేదిక ప్రకారం, దేశ జనాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ రాష్ట్రం దేశ జిడిపికి 5 శాతాన్ని అందిస్తున్నది. రాష్ట్రం ఏర్పడే నాటికి తలసరి ఆదాయం 1.24 లక్షలుండగా..నేడు అది 2.37 లక్షలకు చేరుకున్నది. రాష్ట్రంగా ఏర్పడిన కేవలం ఏడు సంవత్సరాల్లో దాదాపు రెండింతలు పెరిగింది. అదే జిఎస్డీపీ, రాష్ట్రం ఏర్పడేనాటికి సుమారు 5 లక్షల కోట్లుగా వుండగా 2021 నాటికి 9.8 లక్షలకు పెరిగింది. దేశ ఆర్థిక రంగానికి చేయూతనిస్తున్న నాలుగవ పెద్ద రాష్ట్రంగా తెలంగాణ ఎదగడం గర్వకారణం.
కోవిడ్ కు ముందు 2018 మొదటి త్రైమాసికం నుండి సుమారు 8 వరుస త్రైమాసికాల పాటు ఆర్థిక వ్యవస్థ మందగించింది. జీడిపీలో పెట్టుబడి శాతం 2011-12 లో 39 శాతంగా వుండగా..2021-22 నాటికి అది 29.3 శాతానికి తగ్గి, దేశ ఆర్థిక స్థితిని దెబ్బతీస్తున్నది. ఈ నేపథ్యంలో, ఇప్పటికైనా పెట్టుబడి శాతాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. చైనాలో పెట్టుబడి పెట్టిన దేశాలు కోవిడ్ తదనంతర కాలంలో మెండుగా అవకాశాలున్న భారతదేశం లాంటి దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహాం చూపుతున్నాయి. ఈ సదవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. ఎఫ్ డి ఐ పెట్టుబడులు కొంతవరకు పెరిగినా ఇంకా మెరుగుపరుచుకునే అవకాశాలున్నాయి. మూలధన వ్యయ లక్ష్యాలను సాధించిన రాష్ట్రాలకు జీఎస్డీపీ లో 0.5 శాతం రుణాలను తీసుకోవచ్చుననే నిర్ణయం స్వాగతించ దగ్గది. క్యాపిటల్ ప్రాజెక్టులపై ఖర్చు చేయడానికి మాత్రమే రుణం తీసుకోవాలి అనే నిబంధనను మేము అనుసరిస్తాం. అందుకు అనుగుణంగా FRBM రుణ పరిమితిని 2 శాతానికి పెంచాలని కోరుతున్నాం. తెలంగాణ వంటి పురోభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక శాఖ నిబంధనలను సరళతరం చేసి సహకరిస్తే ఇంకా సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం వుంది. ఈ విధానం రాష్ట్రాల్లో ఉద్యోగాల కల్పనకు మరింతగా ఊతం ఇస్తుంది.
టెక్స్ టైల్స్, గార్మెంట్స్, టాయ్స్, లెదర్ గూడ్స్, లైట్ ఇంజినీరింగ్ వస్తువులు, ఫుట్‌వేర్ వంటి రంగాలలో పెట్టుబడి రాయితీలు కల్పించినట్లయితే, తక్కువ నైపుణ్యం కలిగిన వ్యక్తులకు కూడా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లలో పరిశ్రమలల్లో పోటీ పడే సామార్థ్యం వారిలో పెరుగుతుంది. ఇదే విధానాన్ని తూర్పు ఆసియా, చైనా దేశాలు అవలంబించి అద్భుత ఆర్థిక వ్యవస్థలను ఏర్పాటుచేసుకున్నాయి. భారతదేశం కూడా అదే మార్గాన్ని అనుసరించవచ్చు.
ఎంఎస్ ఎం ఈ లు దేశ జిడిపికి 30 శాతం కంట్రిబ్యూట్ చేస్తున్న నేపథ్యంలో, ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాలను (PLI) లను వీటికి కూడా విస్తరించాలి. చిన్న నుండి మధ్యస్థానికి, మధ్యస్థం నుండి భారీ స్థాయికి అంచలంచలుగా అభివృద్ధి చెందే సంస్థలకు వడ్డీ రాయితీని విస్తరించాలి. ప్రోత్సాహకాలనేవి అభివృద్ధిని అందుకునే దిశగా వుండాలి తప్ప, ఉద్దేశ్యపూర్వకంగా కేవలం రాయితీల కోసం ఆశపడి, ఎదుగుదల లేకుండా చిన్న సంస్థలుగానే మిగిలిపోకూడదు.
అదే సమయంలో… పెట్టుబడి రాయితీలను అందించే విషయంలో కేంద్ర ఆర్థికశాఖ వివేకాన్ని ప్రదర్శించాలి. ప్రస్థుతం రాష్ట్రాల నడుమ అనారోగ్యకరమైన పోటీ నెలకొని వున్నది. ఆర్థిక రంగంలో అంతర్జాతీయ స్థాయి పోటీని ఎదుర్కునేలా కేంద్రం రాష్ట్రాలకి ప్రోత్సాహకాలందించాలి. ఉదాహరణకు, బెంగళూరు హైద్రాబాద్ నడుమ ఇవ్వాల్సిన డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ను తీసకపోయి బుందేల్ ఖండ్ లో ఏర్పాటు చేయడం వలన ఫలితాలు సాధించడంలో మూడేండ్ల ఆలస్యం జరిగింది. అందుచేత, పెట్టుబడి రాయితీల విషయంలో పాతాళానికి పరుగులా కాకుండా, పర్యావరణ వ్యవస్థ మరియు సినర్జీలు ఉన్న ప్రాంతాలపై కేంద్రం దృష్టి పెట్టాలి. అట్లా తెలంగాణలోని వరంగల్‌లో ప్రతిపాదిత కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అందుకు ఒక మంచి ఉదాహరణ.
రాష్ట్ర ఏర్పాటుకు ముందు ప్రకటించిన ఐటీఐఆర్ ప్రాజెక్టులను ఇప్పుడు నిలిపేసారు. ఆరు పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని పదే పదే అడిగినా మంజూరు చేయలేదు. డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఫార్మాస్యూటికల్స్ పరిశ్రమలలో తెలంగాణకు అవసరమైన ఎకో సిస్టమ్’ ఉన్నందున మా విజ్జప్తిని ఇప్పటికైనా పరిగణించాలని కేంద్రాన్ని సమావేశంలో కోరారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ ఇంతవరకూ మంజూరు చేయలేదు పేపర్లకే పరిమితమయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పరిస్థితులపై స్వాట్ (SWOT) అనాలిసిస్ చేసి ఏఏ రాష్ట్రాల్లోఎలాంటి పరిస్థితులున్నాయి అనుకూల వాతావరణాలున్నాయనే విషయాలను పరిశీలించి.. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా సహకరించాలి.
ఉదాహరణకు తెలంగాణ కు సముద్రతీరం లేదు. కాబట్టి డ్రైపోర్టుల ఏర్పాటుకు విరివిగా అవకాశాలు కల్పించాలి. రాబోయే పది సంవత్సరాలు అత్యధికంగా ఉద్యోగాల కల్పన అవకాశాలు, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు మరియు లైఫ్ సైన్సెస్ లో వున్నాయి. కాబట్టి ఈ రంగాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించాలి.
రాష్ట్రాలకు పెట్టుబడి అందుబాటులోకి రావడానికి సావరిన్ ఫండ్స్ మరియు పెన్షన్ ఫండ్స్ ను రాష్ట్రాలకు మూలధన పెట్టుబడిగా వినియోగించుకోవడానికి కేంద్రం అవకాశమివ్వాలి. తెలంగాణ నూతన స్టాటప్ స్టేట్. కేంద్ర ప్రభుత్వం, శీఘ్రగతిన ముందుకు పోతున్న తెలంగాణకు అదనపు ఆర్థిక ప్రోత్సహకాలు అందించడం వలన దేశ జిడిపికి అధికంగా దోహదం చేస్తుంది.
కేంద్ర ప్రభుత్వం పాలసీ చేస్తుంది. వాటిని క్షేత్సస్థాయిలో అమలు చేయడం రాష్ట్ట్రాల బాధ్యత. నీరు భూమి మానవ వనరుల వంటి మౌలిక వసతులను రాష్ట్రాలే సమకూర్చాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలను సహకార సమాఖ్య స్పూర్తితో, రాష్ట్రాలను బలోపేతం చేసే దిశగా అధికార వికేంద్రకరణ జరగాలి.
టాక్స్ డివల్యూషన్ ద్వారా రాష్ట్రాలకు మరింత డబ్బు అందించాలి. రోజు రోజుకూ పెరుగుతున్న సెస్‌ల విధింపుతో ‘డివిజబుల్ పూల్’ మరింతగా కుంచించుకుపోతోంది. 1980లో కేంద్రం పన్ను రాబడిలో 2.3% మాత్రమే వున్న సెస్ లు 2021లో 20% కు చేరుకున్నాయి. కొన్నిసార్లు ఈ సెస్‌లు.. ప్రాథమిక ధరలకంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ విపరీత పోకడలను హేతుబద్ధీకరిస్తే, రాష్ట్రాలు పన్నుల పంపిణీ ద్వారా మరిన్ని వనరులు సమకూర్చుకోగలుగుతాయి.
మెడికల్ డివైజెస్ తయారీ రంగంలో 78 శాతం దిగుమతుల మీద ఆధారపడి వుండడానికి కారణం ఉత్పత్తి వ్యయం కంటే దిగుమతుల ధర తక్కువ గా వుండడమే. ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి దేశంలో సంస్థాగత సంస్కరణలు చేపట్టాల్సిన అవసరమున్నది.
AP పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94 (1) ప్రకారం, పారిశ్రామిక ప్రమోషన్ కోసం పన్ను రాయితీలు తప్పనిసరిగా అందించాలి. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94 (2) ప్రకారం, తెలంగాణలో వెనకబడిన జిల్లాలకు రెండు విడతలుగా రూ. 900 కోట్లు చెల్లించాల్సి ఉందనీ, ఆ నిధులను వెంటనే విడుదల చేయాలి’’ అని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణకు ప్రత్యేక గ్రాంట్‌లకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఇంకా పూర్తిగా అమలు కాలేదనీ,. వాటిని వెంటనే అమలు చేయాలని కేంద్రాన్ని సమావేశంలో మంత్రి కెటిఆర్ డిమాండ్ చేశారు.

Also Read : కేంద్రం నుంచి అవార్డులే..నిధులు నిల్

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్