control Muslim Fundamentals: సిఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలనపై దృష్టి పెట్టాలని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ సూచించారు. సిఎం పరిపాలనపై తగిన దృష్టి పెట్టకపోవడంతో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని అయన ఆరోపించారు. కడప సెంట్రల్ జైలులో కర్నూలు జిల్లా బిజెపి అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డిని కేంద్రమంత్రి పరామర్శించారు. అనంతరం విలేకరులతో మట్లాడుతూ… ఆత్మకూరులో వివాదాస్పద స్థలంలో అక్రమ కట్టడాన్ని అడ్డుకునేందుకే శ్రీకాంత్ రెడ్డి వెళ్ళారని, అసాంఘీక శక్తులు అడ్డుకొని ఆయనపై దాడి చేశారని చెప్పారు. ఆయన్ను హత్యచేసేందుకు పథకం రూపొందించారని కేంద్ర మంత్రి అనుమానం వ్యక్తం చేశారు.
స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చే శ్రీకాంత్ అక్కడకు వెళ్ళారని, అయినా సరే తగిన భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని, బిజెపి కార్యకర్తలు అక్కడ ఉండబట్టి అయన త్రుటిలో తప్పించుకున్నారని మురళీధరన్ వివరించారు. అక్రమకట్టడాలు నిర్మిస్తున్నవారిని, అసాఘీక శక్తులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అయన తీవ్రంగా మండిపడ్డారు. మూడేళ్ళుగా ఏపీ ప్రజలు అవినీతి పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పుడు శాంతి భద్రతల సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయని విమర్శించారు. శ్రీకాంత్ రెడ్డిపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకొవాలని, ఆయన్ను తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మకూరు ఘటనకు కారణమైన వారిపై కేసులు నమోదు చేసి వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
శాంతిని కోరుకునేవారికి రాష్ట్రంలో రక్షణ కరువైందని, శాంతికి విఘాతం కలిగించే వారికి మాత్రం ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తీవ్రవాద, ముస్లిం మతోన్మాద సంస్థల ఆగడాలు ఎక్కువయ్యానని, జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నవారికి ఈ ప్రాంతం స్థావరంగా తయారైందని కేంద్రమంత్రి విమర్శించారు. బిజెపి నేతలకు ఆత్మకూరు వెళ్లేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ సిఎం రమేష్, మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి తదితరులు కేంద్ర మంత్రి వెంట ఉన్నారు.
Also Read : చర్చలకు రాలేము: ఉద్యోగ సంఘాలు