Saturday, January 18, 2025
HomeTrending Newsకేంద్రం జోక్యం చేసుకోవాలి: గోరంట్ల

కేంద్రం జోక్యం చేసుకోవాలి: గోరంట్ల

Center to Respond: రాష్ట్ర గవర్నర్ ను ఉద్దేశించి టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్సవ విగ్రహంగా ఉండి, గుడ్డిగా సంతకాలు పెట్టొద్దని సూచించారు.  కేంద్రానికి నివేదిక పంపేటప్పుడు ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులను వివరించాలని విజ్ఞప్తి చేశారు.  ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అప్పులు తీసుకుంటుంటే గవర్నర్ ఏం చేస్తున్నారని, ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలపై ఎందుకు వివరణ అడగడంలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలు పెట్రోలు, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు తీవ్రంగా బాధపడుతున్నారని, కరెంట్ కోతలతో ప్రజలు, రైతులు అల్లాడుతున్నారని, పరిశ్రమల్లో పవర్ హాలిడే పెట్టారని  గోరంట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్ల  రాష్ట్రం దివాళా స్థితికి చేరుకుందన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో గోరంట్ల మీడియాతో మాట్లాడారు.

ముమ్మాటికీ ఆంధ్ర ప్రదేశ్ లో శ్రీలంక పరిస్థితులు నెలకొని ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ద్వారా లబ్ధి పొండుతున్నవారి వివరాలు, వారి అకౌంట్లలో జమ చేస్తున్న డబ్బుల వివరాలు ఏవైనా లెక్కలు ఉన్నాయా అని గోరంట్ల నిలదీశారు.  రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, అప్పులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వివిధ ఖాతాల్లో ప్రభుత్వ అప్పు 7 లక్షల 76 వేల కోట్ల రూపాయలు ఉందని వెల్లడించారు.  కోవిడ్ నేపథ్యంలో  కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక అనుమతుల ద్వారా అప్పులు పెంచుకుంటూ పోతున్నారని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం తామే నేరుగా కాంట్రాక్టర్ కు నిధులు చెల్లిస్తామని చెప్పిందంటే ఈ ప్రభుత్వ తప్పుడు విధానాలను అర్ధం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైన ఉందని, రాష్ట్ర పరిస్థితి చిన్నాభిన్నం కాకుండా చూడాలని, వెంటనే జోక్యం చేసుకోవాలని గోరంట్ల విజ్ఞప్తి చేశారు.  నెల్లూరు కోర్టులో జరిగిన దొంగతనం విషయమై హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపించాలని కోరారు.

Also Read : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం

RELATED ARTICLES

Most Popular

న్యూస్