Sunday, January 19, 2025
HomeTrending NewsBJP: రాష్ట్ర సారథ్యం మారుతుందా?

BJP: రాష్ట్ర సారథ్యం మారుతుందా?

తెలంగాణలో ఎన్నికల ఫలితాలు చూశాక బిజెపి ఢిల్లీ నేతల్లో అంతర్మధనం మొదలైంది. సీనియర్ నేతల ఓటమి.. ఉహించని నియోజకవర్గాల్లో గెలుపు పార్టీ నేతలను విస్మయ పరుస్తోంది. గుడ్డిలో మెల్ల రీతిలో మజ్లీస్ కన్నా ఒక సీటు ఎక్కువగా గెలవటం కమలనాథులకు ఉరట కలిగించే అంశం.

జాతీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ తో శత్రువుల్లో మిత్రుడు మాదిరి వైరం కొనసాగించినా విపలమయ్యారని రాజకీయ విశ్లేషణలు జరుగుతున్నాయి. కెసిఆర్ చెప్పినట్టల్లా చేస్తే చివరకు డబుల్ డిజిట్ కూడా దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారని వినికిడి. బిజెపి – బీఆర్ఎస్ మధ్య లోపాయికారి అవగాహన ఉన్నదని రాహుల్ గాంధి నుంచి రేవంత్ రెడ్డి వరకు విమర్శలు చేస్తూ… ఎదురు దాడి చేయటంతో ప్రజల్లో ఆలోచన మొదలైంది. ఎన్నికల సమయానికి ఇదే ప్రధాన అంశం అయింది.

తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ పై ఈ స్థాయి వ్యతిరేకత ఉన్నదా అని ఢిల్లీ నేతలు నోరెల్లబెడుతున్నారు. ముస్లిం ఓటర్లు  మజ్లీస్ చెప్పినట్టు చేస్తారు అనుకుంటే పూర్తి విరుద్దంగా కాంగ్రెస్ వైపు నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థులు బలంగా లేనిచోట మాత్రమే  బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. కాంగ్రెస్ నేతలు, సోషల్ మీడియాకు తోడు ముస్లిం పెద్దలు కూడా కాంగ్రెస్ ను బలపరచాలని కోరటం జరగిందని సమాచారం. జాతీయ స్థాయిలో బిజెపిని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని ముస్లిం మతపెద్దలు ఓటర్లకి వివరించారు.

బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నాయకత్వంపై ఢిల్లీ పెద్దలకు భ్రమలు తొలిగాయని అంటున్నారు. పార్టీ obc విభాగం చైర్మన్ కె లక్ష్మణ్, కిషన్ రెడ్డి కలిసి ముషిరాబాద్, అంబర్ పేట్ స్థానాలు రాకుండా చేశారని పార్టీ నేతలు ఢిల్లీ పెద్దలకు ఎన్నికల సమయం నుంచే ఫిర్యాదులు చేశారు. ఈ రెండు స్థానాలు వీరిద్దరి స్వార్థానికి ఇతరులకు దక్కాయని…రాజధానిలో పార్టీ ప్రభావం లేకపోవటానికి వీరి కార్యాచరణ ప్రధాన కారణమని ఆరోపణలున్నాయి.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డ లను కొందరు మేధావులు కలిసినపుడు తెలంగాణలో పార్టీ అధ్యక్షుడి మార్పు ఆత్మహత్య సద్రుశ్యమని ముఖం మీదే చెప్పారని సమాచారం. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తుందని కిషన్ రెడ్డి ప్రకటనలు చేయటంపై ఢిల్లీ వర్గాల్లో ఓ జోక్ సర్క్యులేట్ అయింది. KA పాల్ మాటలకు…కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు తేడ లేకుండా పోయిందని జోకులు వేసుకున్నారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

లోకసభ ఎన్నికల వరకు కిషన్ రెడ్డిని కొనసాగిస్తే కష్టమని…ఆ లోపే మార్చవచ్చని సమాచారం. అయితే బండి సంజయ్  కి ఇవ్వాలనుకున్నా ఆయన ఎంపిగా పోటీ చేస్తారు. కిషన్ రెడ్డి కూడా ఎంపిగా పోటీ చేస్తారు. జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేరు పరిశీలనకు వచ్చినా ఆమె కూడా ఎంపి బరిలో నిలవాలని యోచిస్తున్నారు. పాలమూరు నుంచి జితేందర్ రెడ్డి పోటీ చేస్తే అద్యక్ష పదవికి డీకే అరుణను ఎంపిక చేయవచ్చని అంటున్నారు.

బిజెపి జాతీయ నాయకత్వం రాష్ట్రంలో బిసి,ఎస్సి నేతలను బలోపేతం చేసి ఆ వర్గాలని పార్టీ వైపు మళ్ళించాలని ప్రణాళికలు సిద్దం చేసింది. రాష్ట్రంలో ఈ రెండు వర్గాలను ఆకర్షిస్తే అధికారంలోకి రావటం సునాయసమని వాదిస్తున్నారు. దీంతో లక్ష్మణ్, ఈటెల రాజేందర్ లపై సమాలోచనలు జరుగుతున్నాయని విశ్వసనీయ సమాచారం. వీరిద్దరూ నాయకత్వం వహిస్తే పార్టీకి మేలు కన్నా నష్టమే ఎక్కువని పార్టీ నేతలు నిర్వేదంగా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సారథిని కొనసాగిస్తారా..కొత్త వారు ఎవరు అనే కోణంలో ఢిల్లీ నేతలు కసరత్తు చేస్తున్నారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల సిఎంల ఎంపిక పూర్తి కావచ్చింది..తొందరలో తెలంగాణపై దృష్టి సారిస్తారని పార్టీ నేతలు అంటున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్