రాష్ట్రంలో సామాజిక న్యాయానికి నిదర్శనంగా తనలాంటి బడుగు, బలహీనవర్గాలకు చెందిన ఎందరో నాయకులున్నారంటే అది ముఖ్యమంత్రి జగనన్న ఘనతేనని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. మేము సైతం జగన్ కోసం అంటూ సామాజిక సాధికార యాత్రల్లో బడుగు, బలహీనవర్గాల ప్రజలు నినదిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. రాయదుర్గంలో సామాజిక సాధికార యాత్రకు జనం జైకొట్టారు. ఎమ్యెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బస్సుయాత్ర, బహిరంగసభలో మంత్రులు గుమ్మనూరు జయరామ్, ఉషశ్రీ చరణ్, ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డితో పాటు జెడ్పీ చైర్ పర్సన్ గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ సీఎం జగన్‌కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు, అగ్రవర్ణ పేదల్లోనూ నానాటికీ ఆదరణ పెరుగుతోందని ధీమా వ్యక్తంచేశారు. పేదల పిల్లలు మంచి చదువులు చదివేలా, పేద మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేలా చేస్తున్న జగన్ ను మించిన రాజకీయ నాయకుడు మరొకరు లేరని స్పష్టం చేశారు. చంద్రబాబు మళ్లీ అబద్దాలతో ప్రజల్ని నమ్మించడానికి వస్తున్నారని, నిన్ను నమ్మం బాబూ అని ఆయన్ను వెనక్కుపంపించడం మన బాధ్యత అంటూ విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ… జగనన్న నిరంతరం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ వారి సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలలను నాడు–నేడు ద్వారా కార్పొరేట్ స్కూళ్ల స్థాయికి అభివృద్ధి చేశారని, ఇంగ్లీషు మీడియం బోధనను ప్రవేశపెట్టి, అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన పథకాల ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్నారని గుర్తు చేశారు. గతంలో ఎన్నెన్నో హామీలిచ్చి.. ఏ ఒక్కటీ నెరవేర్చని చంద్రబాబు మళ్లీ తప్పుడు హామీలతో వస్తున్నారని విమర్శించారు. ఆయన మోసాలు అందరికీ తెలుసని మరోసారి ఆయన్ను నమ్మితే నిండా మునిగినట్టేనని హెచ్చరించారు. ఇక్కడ గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి అరాచకాలు, దోపిడీల గురించి ఎంత చెప్పినా తక్కువేనని ఎద్దేవా చేశారు.