Demand White Paper: ఎమ్మెల్సీ అశోక్ బాబు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషమని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. బెయిల్ పై విడుదలైన అశోక్ బాబును అయన నివాసంలో చంద్రబాబు పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇప్పటివరకూ తమ పార్టీకి చెందిన ముగ్గురు మాజీ మంత్రులను జైల్లో పెట్టారని, నలభై మంది కీలక నేతలపై కేసులు పెట్టి వేధించారని, వేలాది మంది కార్యకర్తలపై కేసులు నమోదు చేసి జైల్లో పెట్టారని, 33 మంది నేతలను హత్య చేయించారని విమర్శించారు. టెర్రరిస్టుల తరహాలో ప్రజలపై దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరి పక్షానా టిడిపి అండగా ఉంది పోరాడుతుందని హామీ ఇచ్చారు.
అశోక్ బాబు ఎక్కడా దాక్కోలేదని, తప్పు చేసి ఉంటే ధైర్యంగా ఆఫీసుకు వచ్చి అరెస్టు చేయవచ్చని, అంటే కానీ అర్థరాత్రి అరెస్టు చేయడమేంటని బాబు ప్రశ్నించారు. అర్ధరాత్రి కిడ్నాప్ తరహాలో ఎక్కడెక్కడో తిప్పారని, సిఎం చెప్పినంత మాత్రాన అలా చేయడం తగదని… పోలీసుల విచక్షణ ఏమైందని బాబు ప్రశ్నించారు. ప్రభుత్వానికి వంత పాడే పోలీసు అధికారులకు భవిషత్తులో శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ ప్రభుత్వంపై ప్రజాస్వామ్యం బద్ధంగా పోరాడతామని వెల్లడించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై డిజిపి శ్వేతపత్రం విడుదల చేయాలనీ, లేకపోతే ఒక్కో ఎఫ్ ఐ ఆర్ పై తామే ప్రజల్లో చర్చ పెడతామని బాబు స్పష్టంచేశారు.
Also Read : అశోక్ బాబు అరెస్టును ఖండించిన బాబు