రాష్ట్రంలో తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర డిజిపికి బాబు లేఖ రాశారు. ప్రకాశం జిల్లా లింగసముద్రం ఘటనను అయన ప్రస్తావించారు. వైసీపీ నేతల సూచలనతో మొగిలిచర్లకు చెందిన టిడిపి కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కు పిలిపించి వేధిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు అదుపులో తీసుకున్నవారిలో ఆరు, పదేళ్ళ చిన్నారులు కూడా ఉండడం గర్హనీయమని లేఖలో పేర్కొన్నారు. పార్టీ మారాలంటూ వారిని వేధించి, చిత్రహింసలకు గురిచేశారని, అర్ధరాత్రి 2 గంటలకు వారిని వదిలి పెట్టారని వివరించారు.
మళ్ళీ ఉదయాన్నేఎస్ ఐ ఫోన్ చేసి స్టేషన్ కు రావాలని బెదిరించారని… ఈ వేధింపులు తట్టుకోలేక రత్తయ్య, శ్రీనివాస్ అనే కార్యకర్తలు ఆత్మహత్యకు యత్నించి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో తమ పార్టీ వారిపై పోలీసుల ప్రవర్తన ఏ రకంగా ఉందో అర్ధమవుతుందన్నారు. స్టేషన్ కు పిలిపించిన వారికి కనీసం ఎఫ్.ఐ.ఆర్. కాపీ కూడా ఇవ్వలేదని డిజిపి దృష్టికి తీసుకువచ్చారు. లింగసముద్రం ఘటనపై వెంటనే విచారణ జరిపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని బాబు కోరారు.
రాష్ట్రంలో పోలీస్ ప్రతిష్ఠ రోజురోజుకీ దిగజారిపోతోందని, కొందరు పోలీసులు వైసీపి నేతలు చెప్పినట్లు పని చేస్తున్నారని, ఇప్పటికైనా పక్షపాతం లేకుండా, చట్టానికి లోబడి పనిచేయాలని చంద్రబాబు సూచించారు.