స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై ఏపీ సిఐడి దాఖలు చేసిన రిమాండ్ ఆర్డర్ ను సస్పెండ్ చేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు వచ్చే మంగళవారం నాటికి వాయిదా వేసింది. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ సిద్దార్థ్ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ ఇతరులు…ఏపీ సిఐడి తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు సమయం కావాలని పొన్నవోలు కోరిన దరిమిలా న్యాయమూర్తి దీనికి అంగీకరించారు.
క్వాష్ పిటిషన్ వాయిదా వేసినందున అప్పటి వరకూ చంద్రబాబును సిఐడి కస్టడీకి ఇవ్వొద్దని ఆయన తరనున లాయర్లు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు ధర్మాసనం అంగీకరించింది.
గతంలో తాను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పని చేశానని, కాబట్టి ఈ కేసును తాను విచారించేందుకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని, వేరే బెంచ్ కు మారుస్తానని జస్టిస్ కె. శ్రీనివాస రెడ్డి చెప్పగా.. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని బాబు తరఫు న్యాయవాదులు స్పష్టం చేశారు.