స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై విధించిన రిమాండ్ ను క్వాష్ చేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణను ధర్మాసనం శుక్రవారానికి వాయిదా వేసింది. గత అక్టోబర్ ౩న విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం 17(ఏ)పై ఏపీ హైకోర్టుకు సమర్పించిన పత్రాలను అందజేయాలని ఏపీ సిఐడిని ఆదేశించి విచారణను నిన్న అక్టోబర్ 9 నాటికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ ఎం బేలా త్రివేది, జస్టిస్ అనిరుద్ బోస్ ల ధర్మాసనం నిన్న చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే చేసిన వాదనను విన్నది. నేడు కూడా గంటపాటు తన వాదనను సాల్వే వినిపించారు. అనంతరం ముకుల్ రోహాత్గీ ఏపీ సిఐడి తరపున వాదించారు.
నేడు కూడా 17 (ఏ) పైనే ఇరుపక్షాలూ తమ వాదనలు వినిపించాయి. గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులను సాల్వే సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు ఉంచారు. 2019లో యశ్వంత్ సిన్హా పిటిషన్లపై తీర్పు ఇచ్చారని, చట్ట సవరణకు ముందున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకునే 2019లో కేసు కొట్టేశారని కోర్టుకు తెలిపారు. 1988 అవినీతి నిరోధక చట్టం ప్రకారం పోలీసులకు ఇన్వేస్టిగేషన్ చేసే హక్కు ఉండదని పైగా ఇన్వెస్టిగేషన్ అనేది పోలీసుల బాధ్యత మాత్రమేనని, అన్ని రకాల విధుల్లోని ప్రభుత్వ అధికారులకు సెక్షన్ 17ఏ తో రక్షణ లభించిందని సాల్వే ధర్మాసనం దృష్టికి తీసుకు వచ్చారు. సెక్షన్ 17ఏకు సంబంధించి చట్ట సవరణ ముందు ఉన్న అంశాలకూ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‍లో వచ్చిన మార్పులను కూడా ఆయన ప్రస్తావించారు.