Saturday, January 18, 2025
HomeTrending NewsBabu: మానసిక క్షోభకు గురి చేస్తున్నారు: చంద్రబాబు

Babu: మానసిక క్షోభకు గురి చేస్తున్నారు: చంద్రబాబు

స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై ఆరోపణలు మాత్రమే వచ్చాయని, అవి నిర్ధారణ కాలేదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నట్లు తెలిసింది. ఈ నెల 9న చంద్రబాబు అరెస్ట్ అనంతరం విజయవాడ లోని ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. నేటితో ఆ  గడువు ముగుస్తున్నందున రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబును వర్చువల్ గా జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా బాబు తన ఆవేదనను వ్యక్తం చేశారు. తనను అరెస్ట్ చేసిన తీరు కూడా సరిగా లేదని,  45 ఏళ్ళపాటు ప్రజలకు సేవలు చేశానని, తాను చేసిన అభివృద్ధి రెండు తెలుగు రాష్ట్రాలకు తెలుసనీ బాబు అన్నట్లు తెలిసింది. తాను చేయని తప్పును…చేసినట్లు చెబుతున్నారని, అరెస్ట్ చేసిన తీరు కూడా సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. తనను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని అన్నారు.

ఈ దశలో జడ్జి జోక్యం చేసుకుంటూ మీపై ఉన్నవి ఆరోపణలు మాత్రమేనని, ఇప్పుడు జరుగుతున్నది విచారణ కాదని, తుది విచారణ తర్వాత మాత్రమే నేరస్తులు అవుతారని, రిమాండ్ అనేది శిక్షగా భావించవద్దని, జైల్లో ఏవైనా సమస్యలు ఉంటే తనతో చెప్పాలని విజ్ఞప్తి చేశారు. కాగా, చట్టం అందరికీ సమానం అనే విషయం తనకూ తెలుసని బాబు బదులిచ్చారు. అనంతరం, రెండ్రోజులపాటు కస్టడీ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు జడ్జి నిర్ణయం తీసుకున్నారు. కాగా  బాబును ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్