Saturday, November 23, 2024
HomeTrending NewsBabu: నా జీవితం ధన్యమైంది: బాబు భావోద్వేగం

Babu: నా జీవితం ధన్యమైంది: బాబు భావోద్వేగం

తాను కష్టకాలంలో ఉన్నప్పుడు సంఘీభావంగా నిలిచిన ప్రతి ఒక్కరికీ  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలియజేశారు. ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఈ సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఆయన విడుదలయ్యారు. జైలు వద్ద భారీగా హాజరైన కార్యకర్తలను ఉద్దేశించి బాబు ప్రసంగించారు.

“తెలుగు ప్రజలందరికీ మనస్పూర్తిగా నమస్కారాలు, అభినందనలు. నేను కష్టంలో ఉన్నప్పుడు మీరందరూ 52 రోజులుగా ఎక్కడికక్కడ రోడ్డుమీదకు వచ్చి నాకోసం సంఘీభావం తెలియజేశారు, పూజలు చేశారు. ప్రార్ధనలు చేశారు. మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి, ప్రపంచంలోని అనేక దేశాల్లో నాపట్ల చూపించిన  మద్దతు మర్చిపోలేను. అదే సమయంలో ఎక్కడికక్కడ నేను చేసిన అభివృద్ధి కూడా మీరు తెలియజెప్పారు. నాడు నేను చేసిన అభివృద్ధి మీకు ఏవిధంగా ఉపయోగ పడిందో చెప్పారు. నా ప్రభుత్వ విధానాల వల్ల లాభం పొందిన ప్రతి ఒక్క వ్యక్తి రోడ్డు మీదకు వచ్చి సంఘీభావం తెలియజేశారు. నా జీవితం ధన్యమైంది. ఇలాంటి అనుభూతి ఏ నాయకుడికీ రాదు. నేను ఒకటే హామీ ఇస్తున్నా. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నేను ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయనీయను… ఎవరినీ అనుమతించను, అది నా  నిబద్ధత. ప్రపంచం మొత్తం ఉండే తెలుగు వారందరికీ, నాకు మద్దతుగా నిలిచిన భారతీయులందరికీ..విదేశాల్లో  స్పందించిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

సంఘీభావాన్ని తెలియజేసిన అన్ని రాజకీయ పార్టీలకు కూడా ధన్యవాదాలు.. అభినందనలు. ఒక పక్క నాయకులు, పార్టీలు కూడా నాకు పూర్తిగా సహకరించారు, వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రత్యేకంగా జనసేన అయితే ఓపెన్ గా వచ్చి పూర్తిగా సహకరించారు… పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు. వారొక్కరే కాదు చాలా రాజకీయ పార్టీలు… బిజెపి గానీ, సిపిఐ గానీ, బిఆర్ఎస్ గానీ,  కొంతమంది కాంగ్రెస్ లో ఉండే నాయకులు గానీ అందరు కూడా నాకు సంఘీభావం తెలియజేశారు..వారందరికీ పేరుపేరునా మరొక్కసారి అభినందనలు.

తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలుపెద్ద ఎత్తున రోడ్డు మీదకు వచ్చారు. 52 రోజులుగా నిరవధికంగా, ఏమాత్రం అధైర్యపడకుండా పోరాడారు. కొంతమంది అయితే శ్రీకాకుళంలో  బయలుదేరి కుప్పం వరకు నాకోసం సైకిల్ యాత్ర కూడా చేపట్టారు. సైబర్ టవర్స్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మొన్న హైదరాబాద్ లో ఐటి ప్రొఫెషనల్స్ పెద్ద ఎత్తున, స్వచ్ఛందంగా, స్పాంటేనియస్ గా తరలి వచ్చి సంఘీభావం తెలియజేశారు. వారు ఏ విధంగా లాభం పొందారో అన్నీ చెప్పారు వారందరినీ కూడా పేరుపేరునా మనస్ఫూర్తిగా అభినందిస్తూ…40 సంవత్సరాలుగా, నేను కష్టపడి ప్రజా జీవితంలో చేసిన పనుల్ని ఈ 50 రోజుల్లో ఎక్కడికక్కడ నెమరువేసుకున్నారు.   అలాంటి వారందరికీ పేరుపేరునా మనస్ఫూర్తిగా అభినందిస్తూ… మీడియా కూడా పెద్ద ఎత్తున సహకరించారు వారికి కూడా మనస్పూర్తిగా ధన్యవాదాలు” అంటూ కృతజ్ఞత తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్