Babu letter: రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాల నిరోధంలో, వారికి రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. దిశ చట్టం ద్వారా అత్యాచార నిందితులకు 21 రోజుల్లో ఉరిశిక్ష పడేలా చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన ఏమైందని ప్రశ్నించారు. ఈ మేరకు సిఎం జగన్ కు చంద్రబాబు లేఖ రాశారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రి ఘటనలో… తమ కూతురు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఏదో చోట ప్రతిరోజూ అత్యాచార ఘటనలు జరగడం బాధ కలిగిస్తోందన్నారు. మహిళలపై హింస, అత్యాచారాలు పెరిగిపోడానికి ప్రభుత్వ ఉదాసీన వైఖరే కారణమన్నారు.
తాము బాధితురాలిని పరామర్శించాకే ప్రభుత్వంలో చలనం వచ్చిందని, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయనడానికి విజయవాడ సంఘటనే ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. అత్యాచారం ఎప్పుడు జరిగిందో, ఎక్కడ జరిగిందో కూడా హోం మంత్రికి తెలియకపోవడం బాధ్యతా రాహిత్యమన్నారు. జాతీయ క్రైం బ్యూరో నివేదిక ప్రకారం మహిళలపై జరిగే నేరాల్లో మూడో వంతు ఎపీలోనే అవమానకరమన్నారు.
దిశా చట్టం అమల్లో ఉందా? ఉంటే ఎన్ని కేసులు నమోదు చేశారు, ఎంతమందికి శిక్ష పడిందో వివరాలు చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.