Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవిమానాల మానం తీసిన తాలిబన్లు

విమానాల మానం తీసిన తాలిబన్లు

Chaos at Kabul Airport :

నలభై ఏళ్ల కిందట మా లేపాక్షిలో ఎగువ బస్ స్టాండ్, దిగువ బస్ స్టాండ్ అని రెండు బస్ స్టాండ్లు ఉండేవి. అంటే ఊరికి రెండు కొసల్లో రెండు స్టాపులు. చెట్టు నీడ తప్ప కనీసం నలుగురు కూర్చోవడానికి బెంచి, ఎండా వానా పడకుండా పైన ఒక రేకయినా ఉండేది కాదు.

బస్సు అల్లంత దూరంలో హారన్ కొట్టగానే శత్రువు మీదికి దూకి వెళ్లే యోధుల్లా ప్రయాణికులు సిద్ధమయ్యేవారు. బస్సు ఆగగానే తలుపులో దిగేవారు దిగుతుంటారు. ఎక్కేవారు ఎక్కుతుంటారు. కిటికీల్లో నుండి ఎక్కేవారిని ఆపేవారు ఉండరు. సీట్లు ఖాళీ ఉంటే తుండు గుడ్డలు పరచి సీట్లను రిజర్వు చేసుకునేవారు. కొందరు సంచులు, పెట్టెలు పెట్టేవారు. ఏదీ లేనివారు ఒక చెప్పయినా పెట్టేవారు.

అప్పట్లో ధర్మం ఒంటి కాలి మీదయినా నడిచేది కాబట్టి…చెప్పును కూడా గౌరవించి దాన్ని ఎవరో రిజర్వు చేసుకున్న సీటుగానే ధర్మాత్ములు పరిగణించేవారు. యాభై సీట్లు, మరో ముప్పయ్ మంది నిలుచోదగ్గ బస్సులో రెండు వందల మందిని కండక్టరు సర్దేవాడు. అంత ఇరుకులో కండక్టరు అలవోకగా తిరుగుతూ ఉండేవాడు. ఇంత కిక్కిరిసి ఉన్నా మళ్లీ ప్రతి పల్లెలో పది మంది ఎక్కడానికి చోటు అప్పటికప్పుడు తయారయ్యేది.ఎందరు ఎక్కినా ఇంకొకరు ఎక్కడానికి చోటు మిగిలి ఉండే వాల్మీకి వర్ణించిన పుష్పకవిమానం చూడని వారు…ఈ బస్సుల్లో పుష్పకవిమానాలను అనుభవించేవారు. బస్సు ఆగకముందే బస్సు వేగాన్ని అంచనా వేసి ముందుకు దూకుతూ దిగేవారు. బస్సు వేగంతో పరుగెత్తుతూ ఎక్కేవారు. “ఫుట్ బోర్డు ప్రయాణం ప్రమాదకరం- శిక్షార్హం” అని ఎర్రక్షరాల్లో రాసిన చోట ఫుట్ బోర్డు మీద నిలుచుని గంటలు గంటలు ప్రయాణాలు చేసే వారు. మూడు వందల మంది ఎక్కిన తరువాత అవసరమయితే మరో వంద మంది టాప్ మీద ఎక్కి ప్రయాణించేవారు. కొమ్మలు, కరెంటు వైర్లు తగలకుండా టాప్ ప్రయాణికులకు సెల్ఫ్ డిఫెన్స్ విద్యలేవో వచ్చి ఉండేవి.

కనీసం ఇరవై ఏళ్ల పాటు ఇలాంటి ప్రయాణాలు నాకు ఎన్నో యుద్ధ విద్యలను, సర్దుకుపోయే గుణాన్ని, ఓపికను, ఊపిరాడని తొక్కిసలాటలో ఊపిరి తీసుకునే మెళకువను, కాళ్లను ఎన్నో కాళ్లు తొక్కుతున్నా కదలక నిలబడే బిగువును…ఇంకా ఎన్నెన్నో జీవన పాఠాలను నేర్పాయి.

నిన్నటినుండి ఆఫ్ఘనిస్థాన్ లో విమానాల దగ్గర తొక్కిసలాటలు, పరుగులు చూస్తుంటే భూమి గుండ్రంగా ఉండి…అక్కడక్కడే తిరుగుతూ చివరికి అక్కడికే చేరుకుంటుందనే వేదాంత తత్వ పాఠం అరటిపండు ఒలిచి పెట్టినట్లు అర్థమవుతోంది.

నా లేపాక్షి బస్సు అనుభవం ఈ కాబూల్ విమానాల అనుభవం ముందు నిలబడదు. కావాలంటే మచ్చుకు రెండు మూడు వీడియోలు చూడండి.

Kabul Airport Tells the Taliban’s Story :

విమానం ఎక్కడానికి తొక్కిసలాట. విమానం కిటికీల్లో నుండి సీట్లలోకి దూరడం. ఎగిరే విమానం టైర్ల ముందు పరుగులు. విమానం రెక్కల మీద బాతాఖానీ. విమానం ప్రొపెల్లర్లో విశ్రాంతి. ఆకాశంలో విమానం మీది నుండి కిందికి పడే ప్రయాణికులు.కాబూల్ అధికార గృహాల్లో తాలిబన్లు తుపాకులు పట్టుకుని ఒద్దికగా డ్రై ఫ్రూట్స్ తినడం. కాబూల్, కాంధహార్ ఊరు ఊరంతా ట్రాఫిక్ జామ్.

తాలిబన్ అంటే విద్యార్థి అని అర్థమట. వీరు ఎక్కడ విద్యార్థులో? ఎప్పుడు విద్యార్థులో? అడగలేక ఆఫ్ఘన్ అధ్యక్షుడే పరారైపోయాడు.

ఇప్పుడు సుకుమారులయిన తాలిబన్ విద్యార్థుల సంస్కారానికి ప్రతిబింబంగా మనం చూస్తున్న వీడియోలు శాంపిల్. ట్రయిలర్లు. థియరిటికల్ రిలీజ్ లు. అసలు వీడియోలు, పూర్తి సినిమా, ప్రాక్టికల్ వీడియోల కోసం కొన్ని వారాలు వెయిట్ చేయాలి.
అభీ పిక్చర్ బాకీ హై.

చరిత్రలో పాతరాతి యుగం గురించి చదువుతుంటాం. తాలిబన్ లు ఆ పాతరాతి యుగాన్ని ఆవిష్కరించే పురావస్తు విద్యార్థులు. తవ్వకాల్లో తాలిబన్లు బయటపడ్డారా? తాలిబన్లను తవ్వితే పాతరాతియుగం బయటపడిందా? అన్నది చెట్టు ముందా? విత్తు ముందా? లాంటి అర్థం లేని ప్రశ్న.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read: బతికి ఉంటే బలుసాకయినా తినవచ్చు

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్