హైదరాబాద్ మహా నగరంలో నాలుగవ రైల్వే స్టేషన్ చర్లపల్లి టెర్మినల్ కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. 98 శాతం పనులు పూర్తైన చర్లపల్లి రైల్వే టెర్మినల్ త్వరలో జాతికి అంకితం కానున్నది. దీనితో హైదరాబాద్ లోని ఈ శాటిలైట్ టెర్మినల్ తెలంగాణలో నాల్గవ అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా అవతరించనున్నది.


నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్‌లలో ప్రస్తుతం ఉన్న రద్దీని ఈ టెర్మినల్ తగ్గిస్తుంది. రూ. 434 కోట్లతో నిర్మిస్తున్న ఈ స్టేషన్‌లో 19 కొత్త లైన్లతో పాటు అదనంగా 15 జతల రైళ్లను నిలిపే సౌకర్యం కల్పిస్తోంది. ఈ టర్మినల్ తెలంగాణ రైల్వే అవసరాలను తీర్చడంలో ప్రముఖ పాత్ర పోషించనున్నది.

స్టేషన్ మూడు వైపులా రహదారులు ఉండగా ఒకవైపు పెండింగ్ లో ఉంది. రోడ్డు పనులు తొందరగా పూర్తి చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జి.హెచ్.ఎం.సి అధికారులను ఆదేశించారు. ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగరానికి మరికొన్ని కొత్త రైళ్లతో పాటు కొత్త ప్రాంతాలకు రైళ్ళు ప్రారంభం అవుతాయని అధికారుల అంచనా.

-దేశవేని భాస్కర్