ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం” (world youth skills day) సందర్భంగా తెలంగాణ యువతకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనే ధ్యేయంగా పని చేస్తున్నామని చెప్పారు. పరిశ్రమలు, ఐటీ రంగంలో లక్షలాది యువతకు ఉద్యోగవకాశాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం రంగంలో ఇప్పటికే 1.30 లక్షలకుపైగా ఉద్యోగాలు ఇచ్చామని, మరో 50 వేల ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ ప్రారంభమైందని వెల్లడించారు. భవిష్యత్తులో జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతామని వివరించారు. యువతలో నైపుణ్యాల పెంపునకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని వెల్లడించారు. నైపుణ్య శిక్షణ కోసం దేశంలోనే తొలిసారిగా టాస్క్ ఏర్పాటు చేసినట్లు కేసీఆర్ తెలిపారు. సాధించుకున్న రాష్ట్ర ఫలాలను వర్తమాన, భవిష్యత్తు యువతరానికి పూర్తిస్థాయిలో అందించేలా ప్రభుత్వం తెలంగాణను తీర్చిదిద్దుతున్నదన్నారు. అందుకు తగ్గట్టుగా పకడ్బందీ ప్రణాళికలను రచించి అమలు చేస్తున్నదని సిఎం తెలిపారు.
సకల జన జీవనం గుణాత్మకంగా అభివృద్ధి చెందిననాడే నిజమైన అభివృద్ధి అని ప్రభుత్వం విశ్వసించిందన్నారు. అందుకు అనుగుణంగానే ప్రాధాన్యతక్రమంలో అభివృద్ధి కార్యాచరణ చేపట్టిందన్నారు. తెలంగాణ గ్రామీణ పట్టణ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనే ధ్యేయంగా ఏడేండ్లుగా అమలు పరుస్తున్న ప్రభుత్వ కార్యాచరణ కొలిక్కివచ్చిందన్నారు. సంపదను సృష్టించి దాన్ని ప్రజలకు పంచడం అనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. పునర్నిర్మితమైన తెలంగాణ స్వరాష్ట్ర ఫలాలను యువతీ యువకులు అనుభవించే పరిస్థితులు నేడు తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్నాయని సిఎం అన్నారు.
సాగునీరు, తాగునీరు విద్యుత్తు రంగాలను గాడిలో పెట్టి, వ్యవసాయాన్ని అభివృద్ధిపరిచి, రైతు సహా సబ్బండ వర్గాల సంక్షేమానికి అనేక పథకాలను అమలుపరుస్తూ వస్తున్నామన్నారు. తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న సమీకృత అభివృద్ధి కార్యాచరణ సత్పలితాలనిస్తున్నదన్నారు. పలు పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశామని తద్వారా గ్రామీణ యువతకు ఉపాధి కల్పన పెరుగుతున్నదన్నారు. పట్టణాల్లో ఉపాధి రంగాలను మెరుగుపరిచే కార్యక్రమాలను అమలు చేస్తూ వాటి ఫలాలను యువతకు అందించే స్థాయికి చేరుకున్నామన్నారు. పరిశ్రమలు ఐటి రంగంలో లక్షలాది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పించిందని సిఎం అన్నారు. ప్రభుత్వ రంగంలో ఇప్పటికే 1 లక్షా ముప్పై వేలకు పైగా ఉద్యోగాలిచ్చిందని, నూతన జోన్ల ఆమోదం తర్వాత జోన్లలో క్లారిటీ రావడంతో మరో యాభై వేల ఉద్యోగాలకోసం కార్యాచరణ ప్రారంభమైందని సిఎం అన్నారు. భవిష్యత్తులో జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నామన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలితాలను తెలంగాణ ప్రజలు దక్కించుకోవడం ఇప్పటికే ప్రారంభమైందన్నారు. దండుగన్న వ్యవసాయం నేడు పండుగలా మారడమే అందుకు ఉదాహరణ అని సిఎం స్పష్టం చేశారు. వ్యవసాయ రంగం నేటి యువతను కూడా ఆకర్షిస్తుండడం వెనక తెలంగాణ ప్రభుత్వ శ్రమ ఎంతో ఉన్నదన్నారు. పారిశ్రామిక, వాణిజ్యం,ఐటి రంగాలు సహా వ్యవసాయం దాని అనుబంధ రంగాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నయని, ఈ నేపథ్యంలో లక్షలాదిగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన జరగుతుందన్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని సిఎం అన్నారు.
మారిన కాలమాన పరిస్థితుల్లో యువత మరింత సమర్థవంతంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సిఎం తెలిపారు. తెలంగాణ యువత ఎంతో సమర్థవంతమైందని వారికి నైపుణ్యాలు తోడయితే తిరుగులేని యువశక్తిగా అవతరిస్తుందని సిఎం పేర్కొన్నారు. యువతలో నైపుణ్యాల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని తెలిపారు.
ఐటి సాంకేతిక రంగాల్లో ఉద్యోగాలు లభించే దిశగా తెలంగాణ నైపుణ్య పరిజ్జాన అకాడెమీ (టాస్క్)ని దేశంలోనే తొలిసారి ఏర్పాటు చేసామన్నారు. తద్వారా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు సాంకేతిక, సాంకేతికేతర పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్య శిక్షణను అందిస్తున్నామన్నారు. యువతను ప్రోత్సహించేలా ఐటీ పాలసీని రూపొందించామన్నారు. ప్రత్యేకంగా టీ సాట్ ద్వారా నిరుద్యోగ యువతకు వివిధ స్థాయిల్లో అవగాహనతో పాటు శిక్షణాకార్యక్రమాలను అందిస్తున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు.