Sunday, January 19, 2025
HomeTrending Newssai Chand: ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరం - కెసిఆర్

sai Chand: ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరం – కెసిఆర్

తెలంగాణ ఉద్యమ గాయకుడు,ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ అకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణం పట్ల సిఎం సంతాపాన్నిప్రకటించారు. ఇంత చిన్న వయస్సులో సాయిచంద్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం వొక గొప్ప గాయకున్ని కళాకారున్ని కోల్పోయిందన్నారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయిచంద్ అన్నారు. మరింత ఉన్నతస్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని సిఎం విచారం వ్యక్తం చేశారు.

రాష్ట్ర సాధనలో సాగిన సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరంగా నిలుస్తుందని సిఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో సాయిచంద్ పాడిన పాటలను చేసిన సాంస్కృతిక ఉద్యమాన్ని సిఎం స్మరించుకున్నారు. సాయిచంద్ లేకుండా తన సభలు సాగేవి కావని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ కాలం నుంచి నేటి వరకు తన ఆట పాటలను నిరంతరాయం కొనసాగిస్తూనే వున్నాడని గుర్తు చేసుకున్నారు. తన ఆట పాటతో ప్రజలలో నాడు ఉద్యమ స్పూర్తిని నేడు అభివృద్ధి చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ బిడ్డని కోల్పోవడం తీరని లోటని సిఎం అన్నారు. శోకతప్త హృదయులైన సాయిచంద్ కుటుంబ సభ్యులు ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే శక్తినివ్వాలని భగవంతున్ని ప్రార్థించారు. వారి కుటుంబానికి తాము అండగా వుంటామన్నారు. వారి కుటుంబ సభ్యలకు సిఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్