పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని ఆయన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఎల్లప్పుడూ ప్రజల కోసం ఆలోచించే తపన ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. సాధారణంగా ఏ నాయకుడైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాసేవ చేయాలనుకుంటారని… కానీ పవన్ తనకే పదవి లేకపోయినా తన సొంత నిధులను కౌలురైతుల కుటుంబాల కన్నీళ్లు తుడవడానికి, మత్స్యకారులకు, సరిహద్దుల్లో కాపలా కాస్తున్న జవాన్ల సంక్షేమానికి పెద్ద ఎత్తున సాయం చేశారని గుర్తు చేశారు.
సినిమాల్లోకి బలవంతంగా వచ్చిన పవన్ రాజకీయాల్లోకి ఇష్టంతో వచ్చారన్నారు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కు పోతుందని, ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుందని ఆవేదన వ్యక్తంచేస్తూ… ‘నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, వారి బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం.. మన బాధకంటే అది ఎంతో గొప్పది’ అంటూ తన తల్లికి చెప్పానన్నారు. అమ్మ కడుపున ఆఖరున పుట్టినా అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలన్న విషయంలో అందరికంటే ముందుంటాడని అన్నారు.
అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లనే ప్రజాస్వామ్యానికి మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడయ్యాడని, తాను బలంగా నమ్మిన సిద్దాంతంకోసం రాజకీయాలకు జీవితాన్ని అంకితం చేసిన శక్తి శాలి పవన్ అని చిరంజీవి ప్రశంసించారు. ప్రజల కోసం, రాష్ర ప్రజల భవిష్యత్తు కోసం కోసం ఆ శక్తిని వినియోగించాలంటే చట్టసభల్లో అతని గొంతును మనం వినాలని, జనమే జయం అని నమ్మే జనసేనాని ఏం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించాలని కోరారు. ‘మీకు సేవకుడిగా, సైనికుడిగా నిలబడతాడు, అండగా ఉంటాడు, మీకోసం కలబడతాడు, పిఠాపురం ప్రజలకు మీ చిరంజీవి విజ్ఞప్తి, గ్లాజు గ్లాసు గుర్తుకు ఓటెయ్యండి, పవన్ ను గెలిపించండి’ అని పిలుపు ఇచ్చారు.