Baseless: ఏపీ సిఎం జగన్ తనకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్లు వచ్చిన వార్తలను మెగాస్టార్ చిరంజీవి ఖండించారు. రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని, అలాంటి ఆఫర్లు తాను కోరుకొనే ప్రసక్తే లేదని, ఎవరూ తనకు అలా ఆఫర్ కూడా చేయబోరని వ్యాఖ్యానించారు. రాజ్యసభ వార్తలు పూర్తిగా ఊహాగానాలు మాత్రమేనని స్పష్టం చేశారు.
కృష్ణా జిల్లా డోకిపర్రులో మెగా ఇంజనీరింగ్ కంపెనీ నిర్వహిస్తోన్న గోదా కళ్యాణ ఉత్సవంలో పాల్గొనేందుకు చిరంజీవి నేడు విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు రాజ్య సభ సీటు వార్తలపై అడిగిన ప్రశ్నకు చిరంజీవి స్పందించారు.
అనంతరం ట్విట్టర్ లో కూడా దీనిపై చిరంజీవి వివరణ ఇచ్చారు.
“తెలుగు సినీపరిశ్రమ మేలుకోసం,థియేటర్ల మనుగడ కోసం, ఆంధ్రప్రదేశ్ సి.ఎం శ్రీ వైఎస్ జగన్ గారిని కలిసి చర్చించిన విషయాలని పక్కదోవ పట్టించే విధంగా, ఆ మీటింగ్ కి రాజకీయరంగు పులిమి నన్ను రాజ్యసభకు పంపుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి.అవన్నీ పూర్తిగా నిరాధారం.
రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేను మళ్ళీ రాజకీయాలలోకి,చట్టసభలకు రావటం జరగదు.దయచేసి ఊహాగానాలని వార్తలుగా ప్రసారం చేయవద్దు.ఈ వార్తలకి,చర్చలకు ఇప్పటితో పుల్ స్టాప్ పెట్టమని కోరుతున్నాను.” అంటూ ట్వీట్ చేశారు.
Also Read : త్వరలోనే సానుకూల నిర్ణయం : చిరంజీవి