పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వెయ్యడం ఎందుకని చిరంజీవి అంటున్నారని, మరి పిచ్చుకలు తన మీద బ్రహ్మాస్త్రం వేయవచ్చా అని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. తమ్ముడు తన వాడయినా ధర్మం చెప్పాలికదా? అని వ్యాఖ్యానించారు. ‘ఆ సినిమాను నేనే వదిలేశా మీకెందుకు’ అని పవన్ చెప్పినప్పుడు చిరంజీవి మాట్లాడడం ఎందుకన్నారు. చిరంజీవి అంటే తనకు ఎంతో గౌరవం ఉందని.. సామాన్య కుటుంబంలో, అందునా తన కులంలో పుట్టి ఈ స్థాయికి ఎదిగారని, పార్టీ పెట్టి… రాజకీయాలు వదిలేసి సినిమాలు చేసుకుంటున్నారని అన్నారు.
బాబు- పవన్ విడిపోయినపుడు బాబును చిరంజీవి విమర్శిస్తారని, బాబు-పవన్ కలిసినపుడు మాత్రం బాబును విమర్శించరని ఎద్దేవా చేశారు. చిరంజీవి మాట్లాడేది సరికాదన్నారు. తనను ఎవరైనా ఏదైనా అంటే తలవంచుకుని పోయే నైజం కాదని, నష్టమైనా, కష్టమైనా ఈ నైజం మారదని స్పష్టం చేశారు.
చిరంజీవి అంటే తనకు మరో అంశంలో ప్రత్యేక గౌరవం ఉందని…. ముద్రగడను, ఆయన కుటుంబాన్ని అప్పటి బాబు ప్రభుత్వం వేధించినపుడు తాను, బొత్సగారు ఆహ్వానిస్తే…అప్పుడు హయత్ హోటల్ లో జరిగే మీటింగ్ కు చిరంజీవి వచ్చి ‘రంగాను ఇప్పటికే కొల్పోయాం..ముద్రగడను కోల్పోవడానికి మేము సిద్దంగా లేమ’ని ప్రకటన ఇచ్చారని రాంబాబు గుర్తు చేశారు. అందుకే చిరంజీవి అంటే నాకు గౌరవం ఉందన్నారు. అప్పట్లో దాసరిగారికి, చిరంజీవికీ కాస్త ఎడమొహం పెడమొహం ఉన్నప్పటికి కూడా వారిద్దరూ తాము పిలిస్తే వచ్చారన్నారు.
పవన్ నటించిన బ్రో సినిమాలో తనను కించపరిచారా లేదా అన్నది మీడియా సోదరులు, ప్రజలు గమనించాలని, మొత్తం సినీ పరిశ్రమపై తాను పోరాడుతున్నారని కొందరంటున్నారని అది తప్పని అన్నారు. ఆ సినిమాలో తనను కించపరిచారుకాబట్టి మాట్లాడానని తేల్చి చెప్పారు. మొత్తం సినీ పరిశ్రమను కెలకాల్సిన అవసరం, సమయం తనకు లేదని, తన శాఖ, ఎన్నికలు ఇలా ఎన్నో పనులున్నాయని అన్నారు.