Sunday, September 8, 2024
Homeసినిమాఇమేజ్ చట్రంలో

ఇమేజ్ చట్రంలో

Chiranjeevi Held Up In Stardom : 

2000 సంవత్సరం అనుకుంటా…
ఆదాయం పన్ను ఎక్కువ కట్టినందుకు చిరంజీవికి చెన్నైలో అవార్డ్ ఇచ్చారు.
అప్పుడు ఆయన దగ్గర జెమిని న్యూస్ ఒక సౌండ్ బైట్ తీసుకుంది.
అది ఆఫీస్ కి వచ్చి ఎడిటింగ్ అయ్యేలోపు చిరంజీవి అనుచరవర్గం నుంచి కాల్..
ఆ బైట్ వాడకండి.. సార్ మళ్ళీపంపిస్తారని అభ్యర్థన.
ఆ మధ్యాహ్నం ఫ్లైట్ కే చిరంజీవి హైదరాబాద్ వచ్చేసారు.
చిరంజీవి వచ్చేసరికి ఆయన బైట్ రికార్డ్ చేయడానికి ఇద్దరు రెడీగా వున్నారు.

ఏం మాట్లాడాలి..
ఎలా మాట్లాడాలి..
ఆ డైరెక్షన్ జి కే మోహన్ ది..
ఏ ఏంగిల్ లో, ఏ బ్యాక్ గ్రౌండ్ లో ఏ లైటింగ్ లో మాట్లాడాలి..
ఇవన్నీ చూసుకోడానికి ఛోటా కె నాయుడు .
ఇన్ని ఏర్పాట్ల మధ్య చిరంజీవి తన అనుభూతిని రికార్డు చేసి పంపాడు.
అదే జెమిని టీవీలో ప్లే అయ్యింది.

అప్పటికి ఇన్ని టీవీలు, యూట్యూబ్ చానెళ్లు లేవు.
సెలెబ్రిటీ కనపడితే మీదపడి కరిచేసే వందలాది మంది రిపోర్టర్లు లేరు.
ప్రతిక్షణం ప్రత్యక్షప్రసారాలు లేవు.
అప్పటికే వందల సినిమాల్లో హీరో అయినా.. టీవీ కెమెరాకి మాత్రం చిరంజీవి కొత్తే.
అందుకే మొదట ఇచ్చిన బైట్ లో కాస్త తడబడ్డాడు.

కానీ, తను చిరంజీవి కదా..
తను పొరబడకూడదు..
మాట తొట్రుపడకూడదు.
ముఖంలో కళ తగ్గకూడదు.
చెన్నై ఉక్కపోతకి పట్టే చెమటలు కనపడకూడదు..
అదీ చిరంజీవి జాగ్రత్త..
అభిమానులకు ఎప్పుడూ హీరోగానే కనపడాలనే తపన.

సినిమా వజ్రోత్సవాలు..
చిరంజీవికి లెజెండ్ గా బిరుదిచ్చారు.
దాన్ని మోహన్ బాబు సవాల్ చేసాడు.
అంతే చిరంజీవి ఉక్రోషంతో ఊగిపోయాడు.

Chiranjeevi & Stardom 
అప్పటికప్పుడు ఒక కాలపేటిక తయారుచేసి.. తనబిరుదు అందులో వేసేసాడు.
తన స్థాయిని సవాలు చేస్తేచిరంజీవి తట్టుకోలేడు.
తన భవిష్యత్తుని తానే లాకర్లో పెట్టుకున్న జాగ్రత్త అది.
తన ఇమేజ్ ని ఎవరూ చాలెంజ్ చేయకూడదనే తపన అది.

ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు చిరంజీవి.
పద్దెనిమిది మంది ఎమ్మెల్యేల దగ్గర ఆగిపోయాడు.
మూడేళ్ళముచ్చట తర్వాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేసాడు.
ప్రజారాజ్యం విఫల ప్రయోగం అన్నారు.
తెరమీద మెగాస్టార్ కానీ, పోలిటి్క్స్ లో పిరికివాడన్నారు.
కానీ అది కూడా చిరంజీవి జాగ్రత్తలో భాగమే..
తనది కానిదాన్ని వీలైనంత త్వరంగా వదిలించేసుకునే జాగ్రత్త..
తనదైన ప్రపంచంలో మళ్ళీ తనేవిటో నిరూపించుకోవాలనే తపన..

చిరంజీవికి ఇంత అతి జాగ్రత్త ఎందుకు..
చిరంజీవికి ఇంత ఉక్రోషం ఎందుకు..
చిరంజీవికి ఇంత భయం ఎందుకు..
ఎందుకంటే అతనికి స్టార్ డమ్ పుట్టుకతో రాలేదు.
ఇమేజి అంత ఈజీ గా రాలేదు
క్రేజ్ దానికదే వచ్చిపడలేదు.

చిరంజీవి.. శివశంకర వర ప్రసాద్ గా అడుగుపెట్టేనాటికి..
తెలుగు సినీపరిశ్రమ తీరు వేరు. .
అది రెండుకులాలు.. రెండు ప్రాంతాలకు పరిమితమైన ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.
నటుడంటే.. ముఖానికి అంగుళం పెయింటింగ్..
హీరో అంటే, అందగాడు..
స్టార్ అంటే అరవైయేళ్ళ పైమాటే..
కదలాలన్నీ, మెదలాలన్నీ డూప్ లే..

ఇలాంటి వాతావరణంలో..
చిరంజీవి తెలుగు సినిమాకు కొత్త గ్రామర్ ఇచ్చాడు.
డాన్సులు, ఫైట్లు అనే కొత్త ఫార్మాట్ ఇచ్చాడు.
యువరక్తంతో సినిమా వేగాన్ని పెంచాడు.
కలెక్షన్ల మార్జిన్లు దాటించాడు.
ఇవన్నీ ఒకెత్తైతే..
పాత కులం గోడలు ఎంతొ కొంత బద్దలు కొట్టాడు.
బాబుల , మహానుభావుల ఆధిపత్యానికి గండికొట్టాడు.
తనకొక వర్గాన్ని తయారు చేసుకుంటూనే అందరివాడనిపించుకున్నాడు.
ఇవన్నీ అక్షరాల్లో చెప్పినంత అలవోకగా జరిగేవి కాదు.
వాక్యాల్లో రాసినంత వీజీ కాదు.

రక్తమాంసాలు ధారపోసి కట్టుకున్న కంచుకోట.. చిరంజీవి ఇమేజ్.
అప్పుడే కాదు.. ఇన్నేళ్ళయినా ఇంకా అదే స్ట్రగుల్..
చిరంజీవి ఇంట్లో అట్లేసుకుంటే, అందరూ తిడతారు.
ఇంత కష్టకాలంలో ఒక స్టార్ చేయాల్సింది ఇదేనా అంటారు.
అదే ఆక్సిజన్ సిలిండర్లు పంచితే..ఎవరూ మాట్లాడరు..
చివరికి చిరంజీవే అన్ని మీడియా సంస్థలకూ ఫోన్లు చేసుకున్నాడు.
తన చేస్తున్న మంచిపని అందరికీ చెప్పమని వేడుకున్నాడు.
అలా వేడుకోడానికి కూడా చిరంజీవి వెనుకాడడు.
తన ఇమేజ్ అంటే, అంత పిచ్చి చిరంజీవికి.

అందుకే ఈ ఇమేజ్ కి ఇప్పుడు తనే బందీగా మారాడు.
పాత మూసలను బద్దలు కొట్టిన చిరంజీవే ఇప్పుడు ఒక మూసగా మారాడు.
అరవైయేళ్లు దాటిన హీరోలకు ప్రత్యామ్నాయంగా వచ్చిన యాక్షన్ హీరో..
ఇప్పుడు అదే వృద్ధాప్యంలో స్టెప్పులు, ఫైట్లు చేయడానికి నానా తంటాలు పడుతున్నాడు.
ఇండస్ట్రీ మీద ఒకరిద్దరి పెత్తనాన్ని సవాలు చేసి సుప్రీమ్ హీరో ..
ఇప్పుడు తనే తెలుగు సినిమాకు పెత్తందారు కావాలనుకుంటున్నాడు.

స్టార్ డమ్ ఎవడబ్బసొత్తు కాదని చాటిన మెగాస్టార్..
ఇప్పుడు తనకో కాంపౌండ్ తయారు చేసుకున్నాడు.
తన కుటుంబమే తెలుగు సినిమా పరిశ్రమగా మారాలనుకుంటున్నాడు.
సర్జరీలు చేసో.. సానబెట్టో.. తన వాళ్ళనే హీరోలుగా మారుస్తున్నాడు.
కాలం ఎక్కడా ఆగదు.
మరో చిరంజీవిని తప్పకుండా వెతుక్కుంటుంది.
అంతవరకు ఈ చిరంజీవే మెగాస్టార్.

-శైలి

Also Read: అప్పుడు మేకకొక తోక – ఇప్పుడు తోకకొక మేక

Also Read: మనకు ఆటలంటే మాటలే

RELATED ARTICLES

Most Popular

న్యూస్