ఇన్నర్ రింగ్ రోడ్ పై కేవలం ఒకే ప్రశ్న అడిగారని, మిగిలిన ప్రశ్నలు దానికి సంబంధం లేనివే అడిగారని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు కేసులో లోకేష్ నేడు ఏపీ సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఉదయం పదిగంటలకంటే ముందే తాడేపల్లిలోని సిఐడి కార్యాలయానికి చేరుకున్న లోకేష్ ను మొత్తంగా ఆరున్నర ఆరున్నర గంటల పాటు విచారించారు. మధ్యలో గంటసేపు లంచ్ విరామం ఇచ్చారు.
ఈ కేసులో లోకేష్ ను 14వ నిందితుడిగా చేర్చారు. 41(ఏ) కింద విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేసిన సిఐడి అధికారులు, లోకేష్ తో పాటు న్యాయవాదులను కూడా అనుమతించారు. నేటి విచారణ అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. వారు అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానాలు ఇచ్చానని, విచారణకు సహకరించినందుకు కృతజ్ఞతలు కూడా చెప్పారని, రేపు కూడా విచారణకు రావాలని సూచించారని వివరించారు. అయితే ఏవైనా ప్రశ్నలు ఉంటె నేడు అడగాలని, రేపు తనకు వేరే పని ఉందని సిఐడికి చెప్పానని, కానీ వారు రేపు రావాలన్నారని చెప్పారు.
చంద్రబాబుపై తనకు కక్ష లేదని, తాను లండన్ లో ఉన్నప్పుడు బాబును అరెస్టు చేశారంటూ సిఎం జగన్ వ్యాఖ్యలపై లోకేష్ స్పందించారు. సిఐడి, ఏసీబీ సిఎం కింద పని చేస్తాయా లేదా అనే విషయం కూడా ఆయనకు తెలియదా అంటూ ఎద్దేవా చేశారు.