Thursday, November 21, 2024
Homeసినిమాసినిమా టిక్కెట్ల ధర పెంచాలంటే వీడియో బైట్ తప్పనిసరి

సినిమా టిక్కెట్ల ధర పెంచాలంటే వీడియో బైట్ తప్పనిసరి

సినిమా పరిశ్రమకు వ్యాపారం ఎంత ముఖ్యమో సామాజిక బాధ్యత కూడా అంతే ముఖ్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సినిమా టిక్కెట్ల ధర పెంచాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసే సమయంలో డ్రగ్స్, సైబర్ క్రైమ్స్ పై ఆయా సినిమాలో నటించిన తారాగణంతో కనీసం రెండు నిమిషాల నిడివితో వీడియో బైట్ తయారు చేయించి ఇవ్వాలన్నముందస్తు నిబంధన పెట్టాలని అధికారులను ఆదేశించారు.  నార్కోటిక్స్ బ్యూరో, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో విభాగాలకు టూ, ఫోర్ వీలర్ వాహనాలను అందజేశారు. హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఈ వాహనాలను జెండా ఊపి సిఎం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రగ్స్ నియంత్రణపై మెగాస్టార్ చిరంజీవి ఓ అద్భుతమైన వీడియో సందేశం తయారుచేసి ఇచ్చారన్నారు. డ్రగ్స్ బారిన పడితే జరిగే నష్టంపై అవగాహన కలిగించేలా ఆయన ఈ సందేశం ఇచ్చినందుకు వారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. మిగిలిన వారు కూడా ముందుకు వచ్చి ఈ దిశలో ఆలోచన చేయాలని సూచించారు.

సినిమా విడుదల సమయంలో ధరల పెంపుపై జీవో కోసం వస్తున్నారు గానీ, డ్రగ్స్ నియంత్రణలో సామాజిక బాధ్యత పాటించడంలేదని రేవంత్ అసహనం వ్యక్తం చేశారు. వీడియో బైట్ ఇస్తేనే ధరల పెంపునకు వెసులుబాటు ఇస్తామని.. సమాజం నుంచి వారు ఎంతో కొంత తీసుకుంటున్నప్పుడు కొంతైనా సమాజానికి తిరిగి ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. డ్రగ్స్ నియంత్రించకపొతే, సైబర్ క్రైమ్ అరికట్టకపోతే సమాజం నిర్వీర్యం అవుతుందని, సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత సినిమా పరిశ్రమపై కూడా ఉందని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్