పవన్ కళ్యాణ్ పొలిటికల్ బ్రోకర్ గా మారారని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీని ఎన్డీయేలో చేర్చేందుకు మధ్యవర్తిత్వం చేస్తున్నారని, అదే జరిగితే వైసీపీ నెత్తిన పాలు పోసినట్లేనని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఎన్డీయే మీటింగ్ కు పవన్ హాజరు కావడంపై నారాయణ స్పందించారు. బిజెపితో జట్టుకట్టిన కూటమికి వ్యతిరేకంగా మైనార్టీలంతా ఏకమై వైసీపీని గెలిపిస్తారని అభిప్రాయపడ్డారు. మరోవైపు వైఎస్సార్సీపీని బిజెపి దూరం చేసుకునే పరిస్థితి లేదన్నారు.
ప్రత్యేక హోదా స్థానంలో పాచిపోయిన లడ్డూ ఇచ్చారంటూ గతంలో బిజెపిపై తీవ్ర విమర్శలు చేసిన పవన్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని బిజెపితో కలిసి పనిచేస్తున్నారని ప్రశ్నించారు. నిన్నటిదాకా చేగువేరా దుస్తులు వేసుకున్న పవన్ ఇప్పుడు సావార్కర్ దుస్తులు వేసుకునేందుకు సిద్ధమయ్యారని, రేపు గాడ్సేలా తుపాకి పట్టుకునేందుకు కూడా వెనుకాడరని మండిపడ్డారు. గతంలో తాము కలిసి పోటీ చేసిన మాట వాస్తవమేనని, పవన్ నిలకడ లేని మనిషి అని, ఒక చోట మూడు నిమిషాలు కూడా నిలబడలేరన్న విషయాన్ని ఆ సమయంలో కూడా తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శికి చెప్పానన్నారు.
పవన్ ఊసరవెల్లిగా మారారని, ఇలాంటి నిలకడలేని మనస్తత్వం లేని వాళ్ళతో రాజకీయాల్లో స్థిరత్వం ఉండదన్నారు. ఎన్నికలు వస్తాయి, పోతాయని, ఎన్నికల పొత్తులు కూడా సహజమేనని…. చెగువేరా సిద్ధాంతాలతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకున్న పవన్ బిజెపి కూటమిలో చేరడం సరికాదన్నారు. ఎన్డీయే మీటింగ్ కు పవన్ రావడం దురదృష్టకరమన్నారు.