Sunday, February 23, 2025
HomeTrending Newsరైతులకు వివరంగా చెప్పండి: సిఎం ఆదేశం

రైతులకు వివరంగా చెప్పండి: సిఎం ఆదేశం

వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు ఏంటో తెలియజెప్పాలని, దీనిపై రైతులకు లేఖలు రాయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. మోటార్ల వాళ్ళ రైతుపై ఒక్కపైసాకూడా భారంపడదని, బిల్లు అంతా ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయాన్నికూడా వారికి వివరించాలన్నారు. శ్రీకాకుళంలో పైలట్‌ప్రాజెక్ట్‌ ఎలా విజయవంతం అయ్యిందో, రైతులకు జరిగిన మేలు ఏమిటో కూడా స్పష్టంగా తెలియజెప్పాలన్నారు. 33.75 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అక్కడ ఆదా అయిన విషయాన్ని రైతులకు వివరించాలన్నారు. మోటార్లకు మీటర్లు కారణంగా మోటార్లు కాలిపోవని, ఎంత కరెంటు కాలుతుందో తెలుస్తుందని,  నాణ్యంగా విద్యుత్‌ సరఫరా ఉంటుందనే విషయాన్ని వారికి అర్ధమయ్యేలా చెప్పాలన్నారు. వ్యవసాయ కనెక్షన్ల కోసం దరఖాస్తు పెట్టుకున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరుచేయాలని, ఎక్కడ ట్రాన్స్‌ ఫార్మర్‌ పాడైనా వెంటనే రీప్లేస్‌ చేయాలని సిఎం ఆదేశించారు. ఎనర్జీపై క్యాంప్‌ కార్యాలయంలో  ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి, వినియోగంపై ఆరాతీశారు.

సమీక్షలో సీఎం చేసిన సూచనలు:

  • థర్మల్‌ కేంద్రాల వద్ద సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చూసుకోవాలి
  • దీనికోసం సరైన ప్రణాళికలు రూపొందించండి
  • విద్యుత్‌ డిమాండ్‌ అధికంగా రోజుల్లో పూర్తి సామర్థ్యంతో పవర్‌ప్లాంట్లు నడిచేలా చూసుకోవాలి
  • దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది, వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా విద్యుత్‌ సరఫరా చేయవచ్చు
  • డిమాండ్‌ అధికంగా ఉన్న రోజుల్లో కూడా పరిశ్రమలకు ఇబ్బందిలేకుండా విద్యుత్‌ సరఫరాపై సరైన ప్రణాళికను నుసరించండి
  • కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు బొగ్గు సప్లై జరిగేలా చూసుకోవాలి
  • ఏపీఎండీసీ నిర్వహిస్తున్న సులియారీ బొగ్గు గని నుంచి మరింత మెరుగ్గా ఉత్పత్తి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలి
  • కృష్ణపట్నం పోర్టు రేవు దగ్గరే విద్యుత్‌ ప్లాంట్‌ ఉంది కాబట్టి, ఓడలద్వారా తెప్పించుకునే బొగ్గు ద్వారా అక్కడ పూర్తిస్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి జరిగేలా చూడండి
  • దీనివల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయి, ఉత్పత్తి ఖర్చు మిగతా వాటితో పోలిస్తే తగ్గుతుంది
  • సింగరేణి నుంచి కూడా అవసరమైన బొగ్గు వచ్చేలా అక్కడి యాజమాన్యంతో సంప్రదింపులు జరపాలి
  • కోల్‌స్వాపింగ్‌ లాంటి వినూత్న ఆలోచనలు కూడా చేయాలి
  • పోలవరం విద్యుత్‌ కేంద్ర ప్రాజెక్ట్‌ పనులపైనా సమీక్షించిన సీఎం, పనుల పురోగతిని సీఎంకు వివరించిన అధికారులు.
  • దిగువ సీలేరు వద్ద 115 మెగావాట్ల సామర్థ్యం ఉన్న రెండు యూనిట్ల నిర్మాణాన్ని కూడా 2024 ఏప్రిల్‌నాటికి పూర్తిచేసేదిశగా అడుగులు ముందుకేస్తున్నామన్న అధికారులు.
  • ఎగువ సీలేరులో 150 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 9 యూనిట్ల పంప్డు స్టోరేజీ ప్రాజెక్టుపైనా సీఎం సమీక్ష. డిసెంబరులోగా టెండర్లు ఖరారు చేయాలని ఆదేశం.
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే అన్ని ఇళ్లకూ కరెంటు సరఫరా చేశామన్న అధికారులు. నీళ్లు పూర్తిగా తగ్గాక వ్యవసాయ పంపులకు కరెంటు ఇస్తామన్న అధికారులు.
  • జగనన్న కాలనీల్లో పనులను వివరించిన అధికారులు. కాలనీల్లో ఇంటింటికీ కరెంటు పనులపై తగిన కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్న సీఎం.

ఈ సమీక్షా సమావేశానికి విద్యుత్, అటవీ పర్యావరణ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌ కె విజయానంద్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, ట్రాన్స్‌కో సీఎండీ బి శ్రీధర్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Also Read : ఆరు నెలల్లో మోటార్లకు మీటర్లు పూర్తి: పెద్దిరెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్