CM Kadapa tour:
తన తండ్రి వైఎస్సార్ మరణించినప్పటి నుంచి నేటి వరకూ కడప జిల్లా తనను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావోద్వేగంతో వెల్లడించారు. ఈరోజు తాను ఈ స్థానంలో ఉన్నానంటే అది ఇక్కడి ప్రజలందరి చల్లని దీవేనలవల్లేనని వెల్లడించారు. మూడు రోజుల వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో భాగంగా ప్రొద్దుటూరు మండలం బొల్లవరంలో పర్యటించిన ముఖ్యమంత్రి దాదాపు 516 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపన చేశారు.
అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ఈ 30 నెలల కాలంలో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు 326 కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా డీబీటీ పద్ధతిలో అందించామని వెల్లడించారు. ఈ నియోజకవర్గానికి చెందిన 22,212 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం 200 కోట్ల రూపాయల ఖర్చుతో 500 ఎకరాలు కొనుగోలు చేశామన్నారు. వీరిలో మొదట దఫా గృహనిర్మాణానికి సంబంధించిన లబ్ధిదారులు 10,820 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్లు కూడా మంజూరై మరో పది రోజుల్లో నిర్మాణం కూడా మొదలవుతుందని హామీ ఇచ్చారు. ప్రొద్దుటూరుకు ఉర్దూ డిగ్రీ కాలేజీ, ఆంజనేయ స్వామి గుడి అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
గత నెలలో అన్నమయ్యసాగర్, ఫించా రిజర్వాయర్లు తెగిపోయి ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగడం ఎంతో బాధించిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన కుటుంబాలకు ఆ మనుషులనైతే తాను తెప్పించలేను కానీ, ఆ కుటుంబసభ్యులలో ఒకరిగా అన్ని రకాలుగా తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు.
Also Read : సొంత జిల్లాలో సిఎం జగన్ టూర్