విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపు 60 బొట్లు కాలి బూడిదైపోయాయి. దీనితో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. మత్స్య కారులు జీవనాధారం కోల్పోయారు. గత రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. జెట్టీల వద్ద ఆగి ఉన్న ఒక బోటులో మంటలు వ్యాపించి పక్కనున్న వాటికి కూడా అంటుకున్నాయి. బోట్లలో ఉండే గ్యాస్ సిలిండర్లు, డీజల్ ట్యాంకుల ప్రేలుళ్ళ కారణంగా ఈ అగ్ని కీలలు వేగంగా వ్యాపించి భారీ నష్టం జరిగింది. విశాఖ పోర్ట్ అథారిటీ నుంచి ప్రత్యేక అగ్నిమాపక నౌక ద్వారా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. వందలాది మత్స్యకార కుటుంబాలు జీవనోపాధి కోల్పోయాయి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే పడవలకు నిప్పు పెట్టారని స్థానిక మత్స్యకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో బోట్లు దగ్ధమైన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవాలని ఆదేశించారు. దీనిపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని అధికారులకు సూచించారు, వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి సిదిరి అప్పలరాజును సీఎం జగన్ ఆదేశించారు.