Good News of Pensioners : ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ దారులకు నూతన సంవత్సర కానుక అందించింది. పెన్షన్ ను 2,500 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు జనవరి 1 నుంచే అమల్లోకి రానుంది. నేడు జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన ’స్పందన’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.
2019 వరకూ రాష్ట్రంలో 65 ఏళ్ళు పైబడిన వృద్ధులకు నెలవారీ పెన్షన్ వెయ్యి రూపాయలు ఉండేది. తాము అధికారంలోకి వస్తే పెన్షన్ ను 2 వేల రూపాయలకు పెంచుతామని పాదయాత్ర సందర్భంగా నాటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చారు. తమ ప్రకటన చూసిన తర్వాత చంద్రబాబు పెన్షన్ పెంచుతారని, నిజంగా బాబు ఈ పని చేస్తే తాము ఈ పెన్షన్ ను ప్రతి ఏడాదీ రూ. 250 చొప్పున పెంచుకుంటూ నాలుగేళ్ళలో 3 వేల రూపాయలు చేస్తామని కూడా జగన్ హామీ ఇచ్చారు. జగన్ చెప్పినట్లుగానే చంద్రబాబు 2019 జనవరిలో పెన్షన్ ను వెయ్యి నుంచి రెండు వేల రూపాయలకు చంద్రబాబు పెంచారు.
2019లో అధికారంలోకి రాగానే సిఎం జగన్ మోహన్ రెడ్డి పెన్షన్ పెంపు ఫైల్ మీదే తొలి సంతకం చేసి రెండు వేలు ఉన్న పెన్షన్ ను 2,250 రూపాయలకు పెంచారు. పెన్షన్ లబ్దిదారుల వయో పరిమితిని కూడా 65 నుంచి 60 ఏళ్ళకు తగ్గించారు. ఆ తర్వాత కోవిడ్ నేపథ్యంలో పెన్షన్ ను పెంచలేకపోయారు. 2022 నూతన సంవత్సర కానుకగా పెన్షన్ ను 2500 రూపాయలకు పెంచుతున్నట్లు సిఎం జగన్ నేడు ప్రకటించారు. జనవరి 1 న పెంచిన పెన్షన్ ను అవ్వా తాతల చేతులో పెడతామన్నారు.