దేశంలో ఒక బేసిన్ నుంచి మరో బేసిన్ కు నీటిని తరలించేందుకు ప్రత్యేక వవ్యస్థలు రూపొందించాల్సిన అవసరం ఉందని, సాగునీటి కొరత తీర్చేందుకు ఇది ఎంతో అవసరమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. విశాఖ నగరంలోని రాడిసన్ బ్లూ హోటల్ లో సెంట్రల్ వాటర్ కమిషన్, ఏపీ జలవనరుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలిసి సిఎం జగన్ ప్రారంభించారు. 74 దేశాల నుంచి1200 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ జనవనరుల రంగంలో ఆంధ్ర ప్రదేశ్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోందని, అతి పెద్ద తీర ప్రాంతం ఉన్నప్పటికీ రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తరచూ తక్కువ వర్షపాతంవల్ల కరువు ఏర్పడుతోందని, ఆయా ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలపై ప్రభావం పడుతోందని అన్నారు. అందులోనూ దిగువ నదీ తీర రాష్ట్రంగా ఉన్నందున గోదావరి, కృష్ణా, నాగావళి, పెన్న, వంశధార నదుల నీటి నిర్వహణ విషయంలోనూ… వర్షాభావం, అధిక వర్షపాతం వచ్చిన సమయాల్లో ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు పడినప్పుడు నీరు వృధాగా సముద్రంలో కలవకుండా ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టుకుని , అవసరమైనప్పుడు దాన్ని వినియోగించుకునే పటిష్టమైన విధానానికి రూపకల్పన జరగాల్సి ఉందన్నారు. వ్యవసాయ రంగానికి సాగునీటి కొరతపై ఇలాంటి సదస్సుల్లో అర్ధవంతమైన చర్చలు జరిగి పరిష్కారాలను కనుగొనాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సదస్సుకు విశాఖ ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందని, అర్ధవంతమైన చర్చలు జరగాలని ఆకాంక్షించారు.