తిరుపతి శాసన సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి ఛైర్మన్ గా నియమించారు. భూమన టిటిడి ఛైర్మన్ గా పనిచేయడం ఇది రెండోసారి. గతంలో డా. వైఎస్ సిఎంగా పని చేసిన సమయంలో 2006-08 మధ్య ఆయన ఈ పదవి నిర్వర్తించారు.
గత నెల మూడో వారంలో భూమన తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ ను ఆయన నివాసంలో కలుసుతున్నారు. అప్పుడే ఈ నియామకం ఖరారైనట్లు వార్తలొచ్చాయి. నేడు అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. వైవీ సుబ్బారెడ్డి వరుసగా రెండో సారి టిటిడి చైర్మన్ గా పనిచేస్తున్నారు. ప్రస్తుత పాలకమండలి పదవీ కాలం ఈ నెల 8వ తేదీతో ముగియనుంది.
డా. వైఎస్సార్ అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చిన భూమన తుడా చైర్మన్ గా, ఆ తర్వాత టిటిడి ఛైర్మన్ గా పని చేశారు. ఆయన పదవీ కాలంలోనే టిటిడి దళిత గోవిందం పేరుతో ఎస్సీ కాలనీల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 2009లో తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన నాడు చిరంజీవి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత చిరంజీవి ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన దరిమిలా 2012లో వచ్చిన ఉపఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. కానీ 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2019 లో మళ్ళీ పోటీ చేసి విజయం సాధించారు. కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి ప్రస్తుతం తిరుపతి డిప్యూటీ మేయర్ గా పని చేస్తున్నారు.