గ్రామ, వార్డు సచివాలయాలను అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ పనితీరుపై అయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు గ్రామ, వార్డు సచివాలయాలను బాధ్యతగా తీసుకోవాలని, వీటి సమర్ధత మెరుగుపడాలంటే నిరంతర పర్యవేక్షణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా తీవ్రత తగ్గిన తరువాత స్వయంగా తాను సచివాలయాలు సందర్శిస్తానని వెల్లడించారు.
మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి సిఎం జగన్ స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్ భారీ వర్షాలు, వరదలు, సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఖరీఫ్ సన్నద్ధత, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల అందుబాటుపై సమీక్షించారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్, అర్బన్ హెల్త్ క్లినిక్‌లు.. బీఎంయూల నిర్మాణ ప్రగతిపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా సిఎం గ్రామ, వార్డు సచివాలయాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఐ టి డి ఏ ప్రాజెక్ట్ ఆఫీసర్లు నిరంతరం పర్యవేక్షించాలని, లేకపోతే సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. కేవలం కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు మాత్రమే సచివాలయాలు సందర్శించారని, మిగిలిన అధికారులు ఆశించిన స్థాయిలో క్షేత్ర స్థాయికి వెళ్ళడం లేదని అయన అసహనం వ్యక్తం చేశారు. మొదట మనుషులమని, ఆ తర్వాతే అధికారులమని గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. మానవత్వం ఉండాలని, పేదల గురించి ఆలోచించాలని హితవు పలికారు. ఏవైనా లోపాలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. సరిగా పనిచేయని సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని సూచించారు.
నిర్దేశించిన సమయం లోపు బియ్యం, పెన్షన్ కార్డులు, ఇళ్ళ పట్టాలు, ఆరోగ్య శ్రీ పతకాలు అర్హులందరికీ అందాలని, ఈ పథకాలన్నీ గ్రామ, వార్డు సచివాలయం నుంచే ఇస్తున్నాం కాబట్టి ఆ సచివాలయాలు పటిష్టంగా పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. వచ్చే స్పందన నాటికి రాష్ట్ర వ్యాప్తంగా వంద శాతం పర్యవేక్షణ పూర్తి కావాలని సిఎం జగన్ ఆదేశించారు.