వైయస్సార్ బీమా కింద పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా చెల్లించేలా పథకంలో మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణించినప్పుడు, ఆ కుటుంబాన్ని సత్వరమే ఆదుకునేలా వైయస్సార్ బీమాలో మార్పులు చేర్పులు చేయాలని సిఎం సూచించారు. క్లెయిముల పరిష్కారంలో చిక్కులు లేకుండా చూడాలన్నారు.
కుటుంబంలో సంపాదిస్తున్న వ్యక్తి అయి ఉండి 18 నుంచి 50ఏళ్ల మధ్య వయస్సు వారు సహజంగా మరణిస్తే వారి కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం, సంపాదించే వ్యక్తి 18 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండి ప్రమాదవశాత్తూ మరణిస్తే 5లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు. జులై 1 నుంచి కొత్తమార్పులతో వైయస్సార్‌బీమా అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది.
జూలై 1 లోగా అర్హులైనవారి వివరాల జాబితా తయారుచేసుకోవాలని సిఎం కోరారు. ఇవేకాకుండా రైతుల మరణాలు, ప్రమాదవశాత్తూ మత్స్యకారులు మరణించినా, పాడిపశువులు మరణించినా, తదితర వాటికి ఇచ్చే బీమా పరిహారాలన్నీకూడా దరఖాస్తు అందిన నెలరోజుల్లోగా చెల్లించాలని, దీనికోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సిఎం జగన్ నిర్దేశించారు.
నెలరోజుల్లోగా క్లెయిములను పరిష్కరించి బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలన్న సీఎం, అన్నిరకాల ఇన్సూరెన్స్ క్లెయిములకు సంబంధించి ప్రతి 3 నెలలకు కలెక్టర్లు కచ్చితంగా నివేదిక ఇవ్వాలని ముఖమంత్రి ఆదేశించారు.
ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు వారికి ఆసరాగా నిలవాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో జాప్యం ఉండకూడదని, భీమా అనేది ఎవ్వరికీ పట్టని వ్యవహారంగా ఉండకూడదని హితవు పలికారు. ఇన్సూరెన్స్ దరఖాస్తుల స్క్రీనింగ్ బాధ్యతను, గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగించాలని సీఎం జగన్ సూచించారు.