Wednesday, March 18, 2026
HomeTrending News'ఎత్తిపోతల'పై ఎస్‌ఓపీ: సిఎం ఆదేశం

‘ఎత్తిపోతల’పై ఎస్‌ఓపీ: సిఎం ఆదేశం

పోలవరం ప్రాజెక్టులో 41.15  మీటర్ల వరకూ సహాయ పునరావాస పనులు పూర్తిచేయడంపై దృష్టిపెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వెలిగొండ టన్నెల్‌-2లో మిగిలిఉన్న 3.4 కిలోమీటర్ల సొరంగం పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని సూచించారు. కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీ దిగువన బ్యారేజీ నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. జలవనరులశాఖపై తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సిఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సిఎం అడిగి తెలుసుకున్నారు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాంలో కోతకు గురైన ప్రాంతంలో చేపట్టే పనుల ప్రణాళికపై అధికారులతో సిఎం చర్చించారు. ఇప్పటికీ గోదావరిలో వరద కొనసాగుతోందని,  ప్రస్తుతం రెండున్నర లక్షల క్యూసెక్కుల వరదనీరు ఉందని, ఎలాంటి పనులు చేపట్టాలన్నా, ముందు కోతకు గురైన ప్రాంతంలో పరీక్షలు, ఆ పరీక్షల్లో వెల్లడైన అంశాలు, దాని తర్వాత డిజైన్ల ఖరారు పూర్తయితే కానీ చేయలేమని అధికారులు సమావేశంలో వివరణ ఇచ్చారు.

డయాఫ్రం వాల్‌ పటిష్టతపై నిర్ధారణలకోసం పరీక్షలు నవంబర్‌ మధ్యంతరం నుంచి మొదలవుతాయని,  దీనిపై తుది నివేదికలు రావడానికి డిసెంబరు నెలాఖరు వరకూ పట్టే అవకాశం ఉందని, ఆతర్వాత సీడబ్ల్యూసీ డిజైన్లు, మెథడాలజీ ఖరారు చేయాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. పరీక్షలు ఒకవైపు నడుస్తున్న సమయంలోనే దిగువ కాఫర్‌డ్యాం పూర్తిచేస్తామని తెలిపారు. దిగువ కాఫర్‌ డ్యాం పూర్తికాగానే ఆ ప్రాంతంలో డీ వాటరింగ్‌ పూర్తిచేసి, డిజైన్ల మేరకు ఈసీఆర్‌ఎఫ్‌ పనులు ప్రారంభిస్తామన్నారు.

కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌  పనులు కూడా జూన్‌ కల్లా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పగా, వీటన్నింటితోపాటు రిజర్వాయర్లు, నీటి ప్రాజెక్టుల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు సిఎం. అవసరమైన సిబ్బందిని నియమించుకోవడంతోపాటు, నిర్వహణపై ఒక కార్యాచరణ రూపొందించాలని, క్రమం తప్పకుండా నిర్వహణ పనులు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

ఏళ్లకొద్దీ నిర్వహణ సరిగ్గా లేక చాలా ఎత్తిపోతల పథకాలు మూలనపడుతున్నాయని అధికారులు సిఎంకు తెలియజేశారు. వెంటనే స్పందించిన సిఎం వీటి నిర్వహణపై ఒక ఎస్‌ఓపీ రూపొందించాలన్నారు.  సంబంధిత ఎత్తిపోతల పథకాల పరిధిలో రైతులను కమిటీలుగా ఏర్పాటుచేసి వారి పర్యవేక్షణలో ఈ పథకాలు నడిచేలా తగిన ఆలోచనలు చేయాలని దిశా నిర్దేశం చేశారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న మంచి విధానాలను గుర్తించి వాటిపై కసరత్తు చేయాలన్నారు.  ప్రభుత్వం నుంచి ఒక కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటయ్యేలా చూడాలని,  కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తున్నందున, నిర్వహణ రైతుల పర్యవేక్షణలో సమర్థవంతంగా నడిచేలా తగిన అవగాహన, వారికి శిక్షణ  ఇప్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

గొట్టా బ్యారేజీ నుంచి హిరమండలం రిజర్వాయర్‌కు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులకు టెండర్లు ప్రక్రియ ప్రారంభమైందని, డిసెంబరులో శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నామని, విజయనగరం జిల్లా తారక రామ తీర్థసాగర్‌ పనులు  నవంబర్‌లో ప్రారంభిస్తామని… మహేంద్ర తనయ పనులు పునరుద్ధరణకు అన్నిరకాల చర్యలు తీసుకున్నామని వెల్లడి. రూ.852 కోట్లతో రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ తయారు చేశామని, త్వరలో టెండర్‌ ప్రక్రియను ఖరారుచేస్తున్నామని అధికారులు వివరించారు.  ఈ సమీక్షా సమావేశానికి జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ సి నారాయణరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular