Saturday, January 18, 2025
HomeTrending Newsమరో మెగా డ్రైవ్ కు రెడీ : సిఎం జగన్ పిలుపు

మరో మెగా డ్రైవ్ కు రెడీ : సిఎం జగన్ పిలుపు

వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగానే రాష్ట్రంలో మరో మెగా డ్రైవ్‌ నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు పిలుపునిచ్చారు. వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే ఎంతమందికైనా ఇచ్చే సమర్థత ఉందని నిరూపించారని ప్రశంసించారు. ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు, సచివాలయాల సిబ్బంది… అలాగే మండలానికి రెండు పీహెచ్‌సీలు, అందులో డాక్టర్లు….ఇలా పటిష్టమైన యంత్రాంగం మనకుందని సిఎం అభిప్రాయపడ్డారు. ఒక్క రోజులో 20 నుంచి 25 లక్షల మందికి వాక్సిన్లు ఇచ్చే సామర్థ్యం, యంత్రాంగం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

కోవిడ్‌ –19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌తో పాటు వైద్యశాఖలో నాడు–నేడుపై క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు.  కొత్త మెడికల్‌కాలేజీల నిర్మాణాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని. ఈ పనులు యుద్ధ ప్రాతిపదికన జరగాలని, ఎప్పటికప్పుడు పనులు జరుగుతున్న తీరును పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి కోరారు.  ఆస్పత్రుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలపై సీఎం ఆదేశాల మేరకు అధ్యయనం చేసిన అధికారులు ఈ నివేదికను సిఎంకు వివరించారు.  ఆస్పత్రి ఆవరణకూడా అత్యంత పరిశుభ్రంగా ఉండాలని, నిర్వహణకు సంబంధించి పటిష్టమైన ఎస్‌ఓపీలను తయారుచేయాలని నిర్దేశించారు.

మనం పోటీపడుతున్నది ప్రభుత్వ ఆస్పత్రులతోకాదు, కార్పొరేట్‌ ఆస్పత్రులతో అని అధికారులకు స్పష్టం చేశారు. ఎక్కడా కూడా ప్రమాణాల విషయంలో వెనక్కి తగ్గకూడదన్నారు. అనుకోని ప్రమాదాలు వచ్చే సమయంలో రోగులను సురక్షితంగా ఖాళీచేయించే ఎమర్జెన్సీ ప్లాన్స్‌ కూడా సమర్థవంతంగా ఉండాలని అధికారులను సిఎం కోరారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో అనుసరించే ప్రోటోకాల్స్ పై అధ్యయనం చేసి సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పొరుగురాష్ట్రాల్లో కోవిడ్‌ నియంత్రణ కోసం విధించిన ఆంక్షలను సడలిస్తున్నందువల్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్