రాష్ట్రంలో 16 చోట్ల మెడికల్ హబ్ లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్ –19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్ కార్యాలయంలో ముఖమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వైద్య రంగం బలోపేతానికి జగన్ పలు సూచనలు చేశారు.
జిల్లా కేంద్రాలతో పాటు విజయవాడ, తిరుపతి, రాజమండ్రిలలో హెల్త్ హబ్ లు ఏర్పాటు చేయాలన్నారు. ఒక్కో హబ్ కోసం 30 నుంచి 50 ఎకరాల భూ సేకరణ చేయాలని సూచించారు. మూడేళ్ళలో 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన వారికి ఒక్కో ఆస్పత్రికి 5 ఎకరాల భూమి కేటాయించాలని సూచించారు. దీనిపై నెలరోజుల్లో కొత్త పాలసీని తీసుకురావాలని ఆదేశించారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో 16 మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని, భవిష్యత్తులో వ్యాక్సిన్ లు ప్రభుత్వం తరఫున తయారు చేసేలా విధానం రూపొందించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. అత్యాధునిక వైద్యం కోసం ఇతర నగరాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా చూడాలంటే ప్రభుత్వ అభిమతమని వెల్లడించారు.