ముఖ్యమంతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరుస కార్యక్రమాలతో బిజీగా గడపనున్నారు. అధికారిక కార్యక్రమాలతో పాటు ‘సిద్ధం’ రాయలసీమ ప్రాంత బహిరంగసభలో కూడా పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన ఓ షెడ్యూల్ తయారైంది.
రేపు (13న) సాయంత్రం విశాఖపట్నంలో పర్యటించి ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర స్ధాయి ముగింపు వేడుకల్లో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేయనున్నన్నారు. ఈనెల 15న ఫిరంగిపురంలో జరగనున్న ‘వాలంటీర్లకి వందనం’కార్యక్రమంలో పాల్గొని వాలంటీర్లను సత్కరించనున్నారు,
16వ తేదీన చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించి వైఎస్సార్ చేయూత నిధులను విడుదల చేయనున్నారు. 18వ తేదీన అనంతపురం జిల్లా రాప్పాడులో జరిగే సిద్ధం బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలోనే వైఎస్సార్సీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు వైఎస్ జగన్. 21వ తేదీన అన్నమయ్య రాయచోటి జిల్లాలో పర్యటించి రైతుల ఇన్‌పుట్ సబ్సిడీని; 24వ తేదీన కర్నూలులో ఈబీసీ నేస్తం మూడో విడత నిధులను; 27వ తేదీన గుంటూరులో విద్యా దీవెన నాలుగో త్రైమాసికం నిధులను; మార్చి 5వ తేదీన శ్రీసత్య సాయి పుట్టపర్తి జిల్లా నుంచి జగనన్న వసతి దీవెన రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు. మార్చి 6వ తేదీన చివరి మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.