చంద్రయాన్-3 విజయవంతం కావడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది యావత్ జాతికే గర్వకారణమైన, ఉద్విగ్నభారితమైన క్షణాలని అభివర్ణించారు. చంద్రయాన్ 3 పై సాఫ్ట్ ల్యాండింగ్ ద్వారా ప్రపంచంలో చంద్రుడిపై అడుగు పెట్టిన దేశాల సరసన చేరడం సంతోషకరమన్నారు.
అఖండ విజయంతో ఖగోళ శాస్త్రంలో మరో సరికొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో బృందాన్ని అభినందించారు. ఇప్పటివరకూ ఎవరూ అడుగు పెట్టని చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగు పెట్టడం ద్వారా భారత అంతరిక్ష రంగంలో భారత దేశ ప్రత్యేకతను, సామర్ధ్యాన్ని నిరూపించారని సిఎం జగన్ కొనియాడారు.
భారత అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞాన పరాక్రమాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు అత్యున్నత ఎత్తులకు, శికరాల వైపు నడిపించి చరిత్రను లిఖించారని ముఖ్యమంత్రి ప్రశంసించారు.