రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం రేపు సాయంత్రం సిఎం జగన్ ఢిల్లీ వెళ్లి ఆదివారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగనున్నమావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారుల సమావేశంలో పాల్గొనాల్సి ఉంది.
అయితే నేటి ఉదయం వ్యాయామం చేస్తున్న సమయంలో సిఎం జగన్ కాలు బెణికింది, అయితే సాయంత్రానికి ఈ నొప్పి తగ్గుతుందని భావించారు. క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై జరిగిన సమీక్షలో కూడా సిఎం పాల్గొన్నారు. అయితే సాయంత్రానికి కూడా నొప్పి తగ్గుముఖం పట్టలేదు, బెణికిన ప్రదేశంలో కాస్త వాపు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. సిఎంను పరీక్షించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీనితో అయన తన ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు.
సిఎం జగన్ బదులుగా రాష్ట్ర హోం శాఖ మంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత, డిజిపి గౌతమ్ సావంగ్ లు ఢిల్లీ సమావేశంలో పాల్గొనే అవకాశముంది.
ఈ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై ఇప్పటికే సిఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, పాఠశాలలు, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్రం అమలు చేస్తోన్న పథకాలు, కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన విషయాలతో ఒక నివేదిక కూడా సిద్ధం చేశారు.