Sunday, January 19, 2025
HomeTrending Newsఇదో సరికొత్త సంప్రదాయం: సిఎం జగన్

ఇదో సరికొత్త సంప్రదాయం: సిఎం జగన్

CM disbursed Input Subsidy 

వ్యవసాయంలో నష్టంవచ్చి రైతన్న ఇబ్బందిపడితే మొత్తంగా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ రోడ్డున పడుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతులకు సమస్యలు ఎలా ఉత్పన్నమవుతున్నాయి, వాటిని ఎలా పరిష్కరించాలనే అంశాలపై గత ప్రభుత్వాలు ఆలోచించ లేకపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లుగా రైతాంగం కోసం తమ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలు చరిత్రలో నిలిచిపోతాయని, ప్రతి అంశంలో రైతులను చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తున్నామని చెప్పారు. సెప్టెంబర్ నెలలో సంభవించిన గులాబ్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీని రైతుల అకౌట్లలో జమ చేశారు. నేడు క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సిఎం జగన్ ఈ నిధులు విడుదల చేశారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రైతు నష్టపోతే వారికి ప్రభుత్వం తోడుగా ఉంటుందన్న ఓ సరికొత్త సంప్రదాయానికి తాము శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. వరదలు, తుఫాన్లు లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులు నష్టపోకుండా, అదే సీజన్లో వారికి ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించి, తర్వాతి సీజన్ కు పెట్టుబడి సాయం కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని గర్వంగా చెప్పగలుతామని వెల్లడించారు. నష్టపోయిన ఏ ఒక్కరికీ  అన్యాయం జరగకుండా, పారదర్శకంగా, సోషల్ ఆడిట్ ప్రదర్శిస్తూ లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు.

సెప్టెంబర్ నెలలో గులాబ్ తుపాను కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు  22 కోట్ల రూపాయల ఇన్ పుట్ సబ్సిడీని వారి ఖాతాల్లో నేడు జమ చేస్తున్నామని సిఎం చెప్పారు.  గత ఏడాది నవంబర్ లో నివర్ తుఫాను సంభవిస్తే డిసెంబర్ నెలాఖరు నాటికే…దాదాపు 12  లక్షల ఎకరాల్లో పంట నష్టం సంభవిస్తే, 8 లక్షల 34 వేల మంది రైతులకు 646 కోట్ల రూపాయల పరిహారం అందించామని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ళలో ఇన్ పుట్ సబ్సిడీ కింద మొత్తం 1,070 కోట్ల రూపాయలు అందించామని, దీని ద్వారా దాదాపు 14  లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని వివరించారు.

తమ హయాంలో వైఎస్సార్  రైతు భరోసా ద్వారా రూ.18,777 కోట్లు,  వైఎస్సార్ సున్నా వడ్డీ రుణాలు-1,674; ఉచిత పంటల భీమా 3,788; పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ 18,000; ఆక్వా రైతులకు సబ్సిడీ 1,520; రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఫీడర్ల ఏర్పాటుకు 1,700 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని గణాంకాలతో సహా వివరించారు.  ఈ సందర్భంగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రైతులు సిఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read :  రైతులకు నేడు పంట నష్టం పంపిణీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్