Sunday, September 8, 2024
HomeTrending Newsఅగ్రి గోల్డ్ కుంభకోణం వారి వల్లే: సిఎం జగన్

అగ్రి గోల్డ్ కుంభకోణం వారి వల్లే: సిఎం జగన్

అగ్రిగోల్డ్ కుంభకోణం గత ప్రభుత్వం చేత, గత ప్రభుత్వం వల్ల, గత ప్రభుత్వంలో ఉన్న మనుషుల కోసం జరిగిందని రాష్ట్ర  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు. అగ్రి గోల్డ్ ఆస్తులు కొట్టేయడానికి గత ప్రభుత్వ పెద్దలు ప్రయత్నించారని, వారే ఈ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అని అయన ఆరోపించారు. 20 వేల రూపాయల లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులు చెల్లించిన సొమ్మును క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి వారి అకౌంట్లలో జమ చేశారు.

రూపాయి రూపాయి దాచుకొని కొద్దిగా ఎక్కువ వడ్డీ వస్తుందన్న ఆశతో ఆ కంపెనీలో డిపాజిట్ చేసిన కష్ట జీవుల సొమ్ము అని, కూలి పనులు, చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారు కూడా ఈ బాధితుల్లో ఉన్నారని సిఎం వెల్లడించారు. కనీసం వారు డిపాజిట్ చేసిన సోమ్మునైనా వెనక్కు ఇవ్వాలన్న సంకల్పంతోనే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఓ ప్రైవేట్ కంపెనీ మోసం చేసి ఎగ్గొట్టిన డబ్బును తమ ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని, మానవత్వాన్ని చూపుతూ చెల్లించామని, దేశ చరిత్రలోనే ఇలా జరగడం ఇదే మొదటిసారి అని సిఎం జగన్ వ్యాఖ్యానించారు.

ఇప్పటి వరకూ 10 లక్షల 40 వేల మంది లబ్ధిదారులకు మొత్తం 905 కోట్ల 57 లక్షల రూపాయలను చెల్లించామని జగన్ వివరించారు. తెలుగుదేశం  ప్రభుత్వం వీరిని ఆదుకుంటామని హామీ ఇచ్చి ఆ తర్వాత గాలికి వదిలేసిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత 2019 నవంబర్ లోనే 10 వేల రూపాయలు డిపాజిట్ చేసిన 3.40 మందికి 238 కోట్ల 73 లక్షల రూపాయలు చెల్లించామన్నారు. వివిధ జిల్లాల నుంచి వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అగ్రిగోల్డ్ బాధితులు సిఎం జగన్ తో ముచ్చటించారు. ఎప్పుడో తాము చెల్లించిన సొమ్మును చెప్పిన మాట ప్రకారం ఇస్తున్నందుకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణ దాస్, పుష్ప శ్రీవాణి, మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మేకతోటి సుచరిత, చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, శంకర నారాయణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్