వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల కింద అర్హులైన లబ్దిదారులకు ప్రభుత్వం అందిస్తోన్న ఆర్ధిక సాయాన్ని నేడు ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఏప్రిల్–జూన్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 18,883 జంటలకు రూ.141.60 కోట్ల ఆర్ధికసాయాన్ని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లో జమ చేశారు.
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ వీలైనంత ఎక్కువ మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరాలని ఆకాంక్షించారు. ఏ కుటుంబంలో అయితే ఇల్లాలు డిగ్రీ వరకూ చదువుకొని ఉంటుందో ఆ కుటుంబంలో మిగిలిన వారు కూడా ఉన్నత చదువులు అభ్యసించేందుకు అవకాశం ఉంటుందన్నారు. పేదరికం నుంచి బైట పడాలంటే చదువు తప్పని సరి అనేది తమ అభిమతమని స్పష్టం చేశారు. బాలికా విద్యను ప్రోత్సహించేందుకు వీలుగా ప్రతి మండలంలో ఒక హై స్కూల్ ను జూనియర్ కాలేజీగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా గ్రామ సచివాలయాల్లోనే ఇప్పించే ఏర్పాటు చేశామన్నారు.