Train Accident: శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ వద్ద రైలు ఢీకొని పలువురు మరణించిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు. ఘటనకు సంబంధించిన ప్రాథమిక వివరాలను అధికారులు సీఎంకు అందించారు.
విశాఖపట్నం నుంచి గౌహతి వెళ్తున్న రైలు సాంకేతిక లోపంతో నిలిచిపోయిందని, చల్లగాలికోసం కొంతమంది ప్రయాణికులు కిందకు దిగారని, మరో ట్రాక్‌పై వెళ్తున్న కోణార్క్‌ఎక్స్‌ప్రెస్ వీరిని ఢీకొట్టడంతో కొంతమంది మరణించినట్టుగా ప్రాథమిక సమాచారం వచ్చిందని అధికారులు సీఎంకు వివరించారు. మంచి వైద్య సేవలు అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు అన్నిరకాలుగా సహాయసహకారాలు అందించాలన్నారు.
మరోవైపు రైల్వే అధికారుల సమాచారం ప్రకారం కోయంబత్తూర్ – సిల్చార్ ఎక్స్ ప్రెస్ రైలు లో ని కొందరు ప్రయాణీకులు అత్యవసర చైన్ లాగి దిగి వెళుతుండగా వేరే మార్గంలో నుంచి వస్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ వీరిని డీ కొట్టింది. ఆ స్టేషన్ లో హాల్ట్ లేనందువల్ల చైన్ లాగారని ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తోంది. ఈ విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంది,.