Saturday, November 23, 2024
HomeTrending Newsఅసూయకు మందులేదు: సిఎం జగన్

అసూయకు మందులేదు: సిఎం జగన్

CM Fire:  ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగితే వచ్చేఎన్నికల్లో తమకు డిపాజిట్లు కూడా దక్కవనే కడుపు మంటతో విపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. అందుకే రాష్ట్రం గురించి ఎల్లో మీడియా, ఎల్లోపార్టీలు, దాని అనుబంధ పార్టీలు… రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందంటూ దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. విపక్షాలను, ఎల్లో మీడియాను దొంగల ముఠాగా జగన్ అభివర్ణించారు. ఈ దొంగల ముఠా హైదరాబాద్ లో ఉంటూ తమపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నరసరావుపేటలో వార్డు, గ్రామ సచివాలయ వాలంటీర్లకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సభకు సిఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విపక్షాలపై విరుచుకుపడ్డారు. ఎల్లో పార్టీ కన్నా తాము కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకు మేలు చేశామని, గతంలో పాలనకు, ఇప్పటికీ తేడా గమనించాలని ప్రజలను కోరారు.

ప్రధానితో తన సమావేశాన్ని కూడా బాబు, మీడియా, దత్తపుత్రుడు జీర్ణించుకోలేకపోయారని…వీరి ప్రవర్తనపై తాను ఒక్క విషయం చెప్పదలచుకున్నానని,  ‘అసూయకు మందులేదు… ఇంత అసూయ పడితే మాత్రం … త్వరగా మీకు బీపీలు వస్తాయి, త్వరగా గుండెపోట్లు వస్తాయి… త్వరగా టికెట్ తీసుకుంటారు’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇంత అసూయ మంచిది కాదని హితవు పలికారు. మనం యుద్ధం చేస్తున్నది నీతిగా ఉన్న రాజకీయ నాయకుడితో కాదని, మారీచులతో అంటూ ఫైర్ అయ్యారు. ‘తమకు అనుకూల ప్రభుత్వం ఉంటే వ్యతిరేక ఓట్లు చీలడం కోసం విడివిడిగా పోటీ చేస్తారట, తమకు నచ్చని ప్రభుత్వం ఉంటే వ్యతిరేక ఓటు చీలిపోకుండా కలిసి పోటీ చేస్తారట’… అంటూ పవన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

‘సంక్షేమ పథకాలు ఇలాగే ఇచ్చుకుంటూ వెళితే, పేదలకు ఇలాగే మంచి జగన్ అనే వ్యక్తీ చేస్తే, ప్రతి అక్కా చెల్లెమ్మకు అమ్మ ఒడి అందితే, ప్రతి అక్కా చెల్లెమ్మకు ఆసరా అందితే, ప్రతి అక్కా చెల్లెమ్మకు చేయూత దక్కితే, ప్రతి అన్నాతమ్ముడికి రైతు భరోసా అందితే, ఆరోగ్యం బాగోలేని ప్రతివాడికి ఆరోగ్యశ్రీ అందితే, ఇంటికి పంపేటప్పుడు ఆరోగ్య ఆసరా కింద ఐదు వేలో, పదివేలో పెట్టి పెంపితే, పెన్షన్ కానుక కింద ఒకటో తారీఖునే నా వాలంటీర్ తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, అది సెలవైనా, పండుగైనా కూడా పొద్దున్నే వచ్చి, చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి, చేతిలో పెన్షన్ సొమ్ము పెడితే ఇక వీళ్ళ బాక్సులు బద్దలవుతాయని వీళ్ళందరికీ తెలుసు’  అని తీవ్రంగా విమర్శించారు.

చంద్రబాబు, అయన దత్త పుత్రుడు, వారికి వంతపాడే ఎల్లో మీడియా రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ కొత్త ప్రచారాన్ని అందుకున్నారని, జగనన్న పరిపాలన ఇలాగే సాగితే ఏ ఒక్కరూ తమకు ఓటు వేయరన్న భయంతో ఈ దుర్మార్గుల, దొంగల  ముఠా తమపై లేనిపోని విషప్రచారం చేస్తున్నారన్నారు.  ‘తమ ప్రభుత్వం లాగా ఎన్నికల హామీలు అమలు చేస్తుంటే రాష్ట్రం శ్రీలంక అవుతుందట, వారిలాగా హామీలు విస్మరిస్తే రాష్ట్రం అమెరికా అవుతుందట’ అంటూ జగన్ విపక్షాలపై ఫైర్ అయ్యారు…. పళ్ళు కాసే చెట్టు పైనే రాళ్ళు పడతాయన్నట్లు ప్రజలకు మంచి చేస్తుంటే తమపై లేనిపోని ప్రచారం చేస్తున్నారన్నారు. వారు తమ పాలనలో ప్రజలకు మంచి చేయకపోగా, ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని విపక్షాలను దుయ్యబట్టారు.

‘సంక్షేమ పథకాలు అందుకుంటున్న మన రైతులు, మన పిల్లల్ని, మన అక్క చెల్లెళ్ళను ద్వేషించే ఇలాంటి వారిని మనుషులు అనాలా, లేక మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలు అనాలా, వీరికి మద్దతు ఇచ్చి మంచిని చిన్నాభిన్నం చేసే మీడియాను మీడియా అనాలా లేక రక్త పిశాచులు అనాలో మీరే ఆలోచించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Also Read : 11న కేబినెట్ విస్తరణ: బీసీలకు పెద్దపీట?

RELATED ARTICLES

Most Popular

న్యూస్