వైద్య సేవల విస్తరణలో భాగంగా 108 అంబులెన్స్ సేవలను మరింత బలోపేతం చేస్తూ… కొత్తగా 146 వాహనాలను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కొత్త 108 వాహనంలో వైద్య పరికరాలు, సౌకర్యాలను సిఎం పరిశీలించారు.
2019లో కేవలం 531 అంబులెన్సులు ఉంటేజగన్ సీఎం అయ్యాక 2020లో అధునాతన సౌకర్యాలతో కొత్తగా 412 అంబులెన్స్‌లు ప్రారంభించారు. ఇందుకోసం రూ.96.50 కోట్లు వెచ్చించారు. అలాగే 2022 అక్టోబర్‌లో రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల ప్రజల కోసం ప్రత్యేకంగా 20 అదనపు అంబులెన్సులు కొనుగోలు చేశారు. ఇందుకోసం రూ.4.76 కోట్లు వెచ్చించారు. దీంతో రాష్ట్రంలో అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది. మొత్తంగా ఏడాదికి 108 సేవల కోసం వెచ్చిస్తున్న వ్యయం అక్షరాలా రూ.188.56 కోట్లు.
ఎక్కువ కాలం ప్రయాణించి మూలన పడే స్థితిలో ఉన్న అంబులెన్సుల స్థానంలో 146 కొత్త అంబులెన్సులను 2023లో జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.34.79 కోట్లు ఖర్చు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి కె వి ఉషాశ్రీచరణ్, రహదారులు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా), ఎంపీ నందిగాం సురేష్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎం టి కృష్ణబాబు, పలువురు ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.