మహిళా సాధికారతకు సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశేష ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ అన్నారు. నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్ పనుల్లో మహిళలకు 50 శాతం కేటాయించిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో మహిళలకే సింహభాగం కేటాయించి తమది మహిళా పక్షపాత ప్రభుత్వమనే విషయాన్ని నిరూపించారని పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కార్యక్రమాలు, పథకాలపై వాసిరెడ్డి పద్మ మీడియా సమావేశం నిర్వహించారు. మహిళా కమిషన్ సిబ్బందికి రాఖీ కట్టారు.
రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది మహిళలకు బహుమతులు, పథకాలు మాత్రమే కాకుండా ఒక అందమైన భవిష్యత్తును కూడా జగన్ ఇస్తున్నారని కొనియాడారు. ప్రతి ఆడపడుచూ సిఎం జగన్ కు రాఖీ స్వయంగా కట్టలేకపోయినా హృదయంలోనైనా సరే రాకీ కట్టాల్సిన గొప్ప సందర్భం అని ఆమె అభివర్ణించారు. సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరుమీదే కేటాయిస్తూ ప్రతి కుటుంబంలో కూడా మహిళా సాధికారత అమలు చేస్తోన్న గొప్ప పాలన జగన్ అందిస్తున్నారని వివరించారు.
గతంలో చంద్రబాబు పాలనలో మహిళలకు ఏమేరకు న్యాయం జరిగిందో అందరికీ తెలిసిందే నని పద్మ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మహిళలపై ఎక్కడ అన్యాయం జరిగినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తోందని, గతంలో ఇలా స్పందించిన సందర్భం ఉందా అంటూ చంద్రబాబు, లోకేష్ లను ప్రశించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే రెండేళ్లుగా రాష్ట్రంలో క్రైమ్ రేటు 4శాతం తగ్గిందని గణాంకాలు వెల్లడించారు. దిశా చట్టం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని, త్వరలోనే కేంద్రం ఆమోదించి పంపుతుందన్న విశ్వాసాన్ని వాసిరెడ్డి పద్మ వ్యక్తం చేశారు.