అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటున్న ఘనత సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని శాసనమనడలి సభ్యుడు లేళ్ళ అప్పిరెడ్డి అన్నారు. 20వేల రూపాయలలోపు చెల్లించిన డిపాజిట్‌దారులకు ఆగస్టు 24న మంగళవారం నగదు జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా చేపడతామని వెల్లడించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అగ్రి గోల్డ్ బాధితుల బాసట కమిటీ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. అనంతరం అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
గతంలో 10వేల రూపాయలలోపు డిపాజిట్ దారులకు 240 కోట్ల రూపాయలను చెల్లించామని, ఇప్పుడు 4 లక్షల మంది డిపాజిట్‌దారులకు సుమారు రూ. 511 కోట్లు ప్రభుత్వం చెల్లించబోతోందని వివరించారు. గత ప్రభుత్వం అగ్రిగోల్డ్ యాజమాన్యంతో కుమ్మక్కై బాధితులకు అన్యాయం చేసిందని, చంద్రబాబు ఉదాసీన వైఖరి వల్లే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పందొమ్మిదిన్నర లక్షల మంది బాధితులు, మిగిలిన 9 రాష్ట్రాల్లోని 32 లక్షల మంది బాధితులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వందలాది మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని అయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం 20 వేల రూపాయల లోపు చెల్లించిన డిపాజిట్ దారులకు వారు కట్టిన సొమ్మును వెనక్కు ఇవ్వాలని గతంలో ప్రతిపక్ష నేతగా జగన్ డిమాండ్ చేస్తే నాటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.
అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదనను ముఖ్యమంత్రి జగన్ నాడు పాదయాత్ర సమయంలో అర్ధం చేసుకొని అధికారంలోకి వచ్చిన తరువాత వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, చెప్పిన మాట ప్రకారం ఆడుకుంటున్నారని అప్పిరెడ్డి పేర్కొన్నారు.