అట్టడుగు వర్గాలకు సాధికారిత కల్పించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆ వర్గాల సమస్యల పరిష్కారానికి వైఎస్సార్‌సీపీ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని భరోసా ఇచ్చారు. చాత్తాద శ్రీ వైష్ణవ కులస్తుల రాష్ట్ర స్థాయి నేతల ఆత్మీయ సమావేశం ఆ సామాజిక వర్గ కార్పొరేషన్ ఛైర్మన్ టి.మనోజ్‌కుమార్ అధ్యక్షతన శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి సజ్జల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజాసేవకులుగా పేరుతెచ్చుకునే అట్టడుగు వర్గాల నేతలను నాయకులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ పనిచేస్తున్నారన్నారు.
ప్రజలకు సేవ చేయడం ద్వారా నాయకులు పేరు తెచ్చుకోవాలి గాని అధికారం ఉంది కదా అని జులుం ప్రదర్శించే విధానానికి కాలం చెల్లిందని అన్నారు. వైఎస్ జగన్ నవశక రాజకీయానికి శ్రీకారం చుట్టారని తెలియచేశారు. కొందరి రాజకీయ నేతల మాదిరిగా ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకునే తత్వం వైఎస్ జగన్‌ది కాదని సజ్జల స్పష్టం చేశారు.