Saturday, January 18, 2025
HomeTrending Newsఇదో గొప్ప ముందడుగు: సిఎం జగన్

ఇదో గొప్ప ముందడుగు: సిఎం జగన్

Good Initiative: దేశంలో ఆరు లక్షల కోట్ల రూపాయల  పెట్టుబడులతో, లక్షా నలభై వేలమంది ఉపాధి కల్పిస్తున్న ఆదిత్య బిర్లా కంపెనీ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం శుభ పరిణామమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. మంచి పారిశ్రామికవేత్త, గొప్ప మనసున్న వ్యక్తి అయిన కుమార మంగళం బిర్లా లాంటి వారు ప్రభుత్వం మీద నమ్మకంతో పెట్టుబడులు పెట్టడం, ఈ చొరవ దేశంలో మిగిలిన పెద్ద కంపెనీలకు కూడా ఓ గొప్ప ముందడుగు, మార్గదర్శకం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని బలభద్రపురంలో ఏర్పాటైన కాస్టిక్ సోడా పరిశ్రమను కుమార మంగళం బిర్లాతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో సిఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు కచ్చితంగా స్థానికులకే ఇవాలని ఒక చట్టం తీసుకువచ్చామని,  ఈ విషయంలో కూడా ఆదిత్య కంపెనీ వేస్తున్న అడుగులు మిగిలిన వారికి ఓ మార్గదర్శకం చూపిస్తుందన్నారు. ఎప్పుడో మొదలు కావాల్సి ఉన్న ఈ పరిశ్రమ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ సంవత్సరాలపాటు నిర్మాణానికి నోచుకోలేదని గుర్తు చేశారు.

గత ప్రభుత్వం సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపకుండానే ఎన్నికలకు రెండునెలల ముందు గ్రాసిమ్  కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని హడావుడిగా జీవో ఇచ్చి మభ్యపెట్టిందని సిఎం జగన్ విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత సమస్యలు పరిష్కరించే దిశలో చర్యలు చేపట్టామని, దీనిలో భాగంగా ప్రజల ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని క్యాప్టివ్ థర్మల్ ప్లాంట్ ప్రతిపాదనను విరమించుకునే విధంగా యాజమాన్యాన్ని ఒప్పించామని తెలిపారు. మరోవైపు పారిశ్రామిక వ్యర్ధాలు, పరిశ్రమలు విడుదల చేసే రసాయనాలతో నీరు కూడా కలుషితం అవుతుందన్న స్థానికుల ఆందోళనలను కూడా పరిగణనలోకి తీసుకొని సాంకేతికంగా కూడా కొన్ని మార్పులు తెచ్చామన్నారు. మెర్క్యురి మెమొరీ ద్వారా ఉన్న పాత  విధానాన్ని మార్పు చేసి ఎలక్ట్రాలసిస్ విధానం తెచామని ‘ జీరో లిక్విడ్ వేస్ట్’ పద్ధతి అవలంబించేలా చర్యలు చేపట్టామని, ఈ విషయంలో పరిశ్రమ యాజమాన్యాన్ని  ఒప్పించామన్నారు. ఇప్పుడు ఈ పరిశ్రమపై ఎలాంటి భయాందోళనలకు ఆస్కారం లేదని, దాదాపు 2500 మంది స్థానికులకు ఉద్యోగాలు కూడా లభిస్తాయని భరోసా ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్