Saturday, January 18, 2025
HomeTrending Newsమహిళా సాధికారత కోసమే: సిఎం జగన్

మహిళా సాధికారత కోసమే: సిఎం జగన్

Women Empowerment: అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారని… ఆర్ధికంగా వెనుకబడిన తరగతులకు చెందిన మహిళల సాధికారత, స్వావలంబన కోసమే ‘ వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పథకాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. పేదవారు ఎక్కడున్నా పేదవారేనని, వారికి మంచి చేయాలన్నదే తమ అభిమతమని  చెప్పారు. అగ్రవర్ణాల్లోని పేద మహిళలకు ఏటా 15 వేల రూపాయల ఆర్ధిక సాయం అందించే ‘ వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పథకాన్ని తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో సిఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. లబ్ధిదారులైన మహిళలకు  ఒక్కొక్కరికీ ఏటా 15 వేల రూపాయల చొప్పున మూడేళ్ళలో 45 వేల రూపాయల సాయం అందిస్తారు.  వైయస్‌ఆర్‌ ఈబీసీ నేస్తం ద్వారా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్యులు, బ్రాహ్మణులు, క్షత్రియ, వెలమ, తదితర ఓసీ వర్గాలకు 3 లక్షల 92 వేల 674 మంది మహిళలకు రూ.589 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.

“అంబేద్కర్ కలలుగన్న రాజ్యాంగస్పూర్తిని కొనసాగిస్తూ.. రిపబ్లిక్‌డేకు ఒకరోజు ముందు ఈ కార్యక్రమం చేస్తున్నాం. మన దేశాన్ని మన రాజ్యాంగం ప్రకారమే మనల్ని మనం పాలించుకునే రోజు రిపబ్లిక్‌డే రోజున ప్రారంభమైంది.. రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఇప్పటికి 72 సంవత్సరాలు పూర్తయి.. రేపు 73వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. మన రాజ్యాంగ నిర్మాతలకు నిండు మనస్సుతో నివాళులు అర్పిస్తున్నాం. అందులోని ఆశయాలకు అద్దం పడుతూ.. వాటిని నెరవేరుస్తూ అడుగులు ముందుకేస్తున్నాం” అని సిఎం జగన్ వివరించారు.

రెండున్నరేళ్ల పరిపాలనలో ప్రతి అడుగూ అంబేద్కర్‌ కలలుగన్న రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ అడుగులు వేస్తున్నామని, దీనిలో భాగంగానే ఈరోజు వైయస్సార్‌ ఈబీసీ నేస్తం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని సిఎం అన్నారు. వైయస్‌ఆర్‌ చేయూత ద్వారా 45–60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన దాదాపు 25 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ప్రతి ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్ల పాటు రూ.75 వేలు అందిస్తున్నామని చెప్పారు.

వైయస్‌ఆర్‌ కాపు నేస్తం ద్వారా 45–60 సంవత్సరాల మధ్య వయస్సు గల కాపు, బలిజ, ఒంటరి వర్గాలకు చెందిన దాదాపు 3.27 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15 వేల చొప్పున అందిస్తూ ఆర్థిక స్వాలంబనకు తోడుగా ఉన్నామని సిఎం జగన్ గుర్తు చేశారు.

“ఈబీసీ పథకం ద్వారా పేదరికంలో ఉన్న దాదాపుగా 3.93 లక్షల మందికి ప్రతి ఏటా రూ.15 వేలు ఇస్తూ.. రాష్ట్రంలో 45–60 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మలకు ఈ పథకం ద్వారా లబ్ధి జరుగుతుంది. 60 ఏళ్లు పైబడిన వారందరికీ వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక అమలవుతుంది. ప్రతి నెలా రూ.2500 చొప్పున సంవత్సరానికి రూ.30 వేల లబ్ధి చేకూరుతుంది. రాష్ట్రంలో 45–60 సంవత్సరాల మధ్యలో గల ప్రతి ఒక్క అక్కచెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ.. దాదాపుగా 33 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మన ప్రభుత్వం తోడుగా నిలబడుతుందని సగర్వంగా మీ కుటుంబ సభ్యుడిగా తెలియజేస్తున్నాను”  అని సిఎం తన ప్రసంగంలో పేర్కొన్నారు.

అమ్మఒడి, పెన్షన్‌ కానుక, వైయస్‌ఆర్‌ ఆసరా, మహిళల పేరుమీద 32 లక్షల ఇళ్ల పట్టాలు లాంటి కార్యక్రమాలతో మహిళాభ్యుదయానికి తాము బాటలు వేస్తున్నామన్నారు సిఎం జగన్.  పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు సున్నావడ్డీ అమలు చేస్తూనే.. మరోవైపున సున్నావడ్డీ పథకానికి రూ.2354 కోట్లు చెల్లించామని తెలిపారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన.. వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ..లాంటి పతకాలు కూడా మహిళల ద్వారానే అందిస్తున్నామన్నారు. అక్కచెల్లెమ్మలు ఆర్థిక సాధికారతకు, ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందనే సంకల్పంతోనే వైయస్‌ఆర్‌ ఈబీసీ నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు.

Also Read : అర్ధం చేసుకోండి: చీఫ్ విప్ సూచన

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్