Friday, March 13, 2026
HomeTrending Newsప్రధాని, కేంద్ర ఆర్ధికమంత్రితో సిఎం జగన్ భేటీ

ప్రధాని, కేంద్ర ఆర్ధికమంత్రితో సిఎం జగన్ భేటీ

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. దాదాపు గంట సేపు వీరి భేటీ జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన పలు సమస్యలతో పాటు, విభజన హామీలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ప్రధానికి సిఎం వినతిపత్రం సమర్పించారు.

మొన్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను కలుసు కున్నారు. అతి త్వరలో ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం పార్టీ చేరబోతోందని, రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి-టిడిపి-జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తారని, ఆయా రెండు పార్టీలకూ కలిపి 30 అసెంబ్లీ, 9 పార్లమెంట్ స్థానాలు కేటాయించేందుకు బాబు ప్రతిపాదించారని, సీట్ల  సంఖ్య పెంచాలని అమిత్ షా అడిగినట్లు వార్తలు వచ్చాయి.  బాబు-అమిత్ ల భేటీ జరిగిన మర్నాడే మోడీ-జగన్ ల సమావేశం ఖరారు కావడం రాజకీయంగా ఆసక్తి కలిగించింది.

ప్రధానితో సిఎం చర్చించిన అంశాల్లో ముఖ్యమైనవి.

1. పోలవరం ప్రాజెక్ట్‌లో కాంపొనెంట్‌ వారీగా సీలింగ్‌ ఎత్తివేయడానికి కేంద్ర ఆర్థికశాఖ అంగీకరించిందని, దీంతోపాటు ప్రాజెక్టు తొలివిడతను సత్వరమే పూర్తిచేయడానికి రూ.12,911కోట్ల నిధుల విడుదలకూ అంగీకరించిందని, ఈరెండు అంశాలు కేంద్ర కేబినెట్‌ ఆమోదం కోసం ఎదరుచూస్తున్నాయని, దీనిపై తక్షణమే దృష్టిపెట్టాలని కోరిన ముఖ్యమంత్రి.

2.అయితే పోలవరం మొదటి విడత పూర్తిచేయడానికి దాదాపు రూ.17,144 కోట్లు ఖర్చు అవుతాయని, ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా జలశక్తిశాఖ పెండింగ్‌లో ఉందని వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలని కోరిన ముఖ్యమంత్రి.

3. 2014 జూన్‌ నుంచి మూడేళ్లపాటు తెలంగాణ రాష్ట్రానికి ఏపీ జెన్‌కో విద్యుత్‌ సరఫరా చేసిందని, దీనికి సంబంధించిన రూ.7,230 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే వీటిని చెల్లించేలా చూడాలని కోరిన సీఎం.

4. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాలని కోరిన సీఎం. రాష్ట్ర ఆర్థిక పురోగతికి ప్రత్యేక హోదా అవసరమని, పెట్టుబడులు రావడమే కాకుండా తద్వారా మెరుగైన ఉపాథి అవకాశాలు ఏర్పాడతాయన్న సీఎం.

5. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించామని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఉండేలా రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు నిర్మిస్తున్నామని, ఇప్పటికే కొన్ని కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభం అయ్యాయని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం. కాలేజీల ఏర్పాటుకు సంబంధించి తగిన సహాయ సహకారాలు అందించాలన్న సీఎం.

6. విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుతో అనుసంధానించేలా ప్రతిపాదించిన భోగాపురం, భీమిలి, రుషికొండ, విశాఖపట్నం పోర్టులను కలిపే 55 కిలోమీటర్ల 6 లేన్ల రహదారికి తగిన సహాయ సహకారాలు అందించాలని కోరిన సీఎం.

7. విభజన చట్టంలో పేర్కొన్న విశాఖపట్నం – కర్నూలు హైస్పీడ్‌ కారిడార్‌ను వయా కడప మీదుగా బెంగుళూరు వరకూ పొడిగించాలని, దీనిపై తగిన పరిశీలనలు పూర్తిచేసిన ఈ ప్రాజెక్టు సాకారం అయ్యేలా చూడాలని కోరిన సీఎం. కడప– పులివెందుల– ముదిగుబ్బ – సత్యసాయి ప్రశాంతి నిలయం– హిందూపూర్‌ కొత్త రైల్వేలైన్‌ను దీంట్లో భాగంగా చేపట్టాలని కోరిన సీఎం. ఈ ప్రాజెక్టు వల్ల వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి చక్కటి కనెక్టివిటీ ఏర్పడుతుందన్న సీఎం.

8. విశాఖపట్నం మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని ప్రధానిని కోరిన ముఖ్యమంత్రి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular